Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేతనాలు, ఇతర సమస్యల పరిష్కారంలో మధ్యవర్తిత్వం
- ఎల్డీఎఫ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : జొమాటో, స్విగ్గీ, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్..మొదలైన కంపెనీల్లో డెలివరీ బార్సుగా(గిగ్ వర్కర్స్) పనిచేస్తున్న కార్మికులకు, ఇతర సిబ్బందికి కేరళ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న గిగ్ కార్మికుల కోసం ఒక 'సంక్షేమ నిధి'ని ఏర్పాటుచేయబోతున్నట్టు ఎల్డీఎఫ్ ప్రభుత్వం వెల్లడించింది. పని గంటలు, వేతనాలు, ఉద్యోగ భద్రత...మొదలైన అంశాల్లో కార్మిక హక్కుల్ని కాపాడటానికి ప్రభుత్వపరంగా గట్టి చర్యలు చేపడతున్నామని రాష్ట్ర కార్మికమంత్రి వి.శివన్‌కుట్టీ మీడియాకు తెలిపారు. దోపిడికి గురవుతున్నామని ఆందోళన చెందుతున్న గిగ్ వర్కర్స్‌లో కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మనోధైర్యాన్ని నింపింది. తమ సమస్యలు పట్టించుకునే నాథుడే కరువయ్యాడని కార్మికులు ఆవేదన చెందుతున్న సమయంలో ప్రభుత్వం చొరవ చేసి...వారి డిమాండ్ల పరిష్కారానికి ఒక వేదిక ఏర్పాటుచేస్తామని తెలిపింది.
ఈ ఏడాది మార్చిలో తిరువనంతపురంలో జొమాటో ఏజెంట్స్, గిగ్ వర్కర్స్ సమ్మెకు దిగారు. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగటంలో డెలివరీ బార్సు ప్రయోజనాలు దెబ్బతిన్నాయి. కార్మికులకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించకుండా అంగీకార పత్రాలపై యాజమాన్యాలు బలవంతంగా సంతకాలు చేయించటం వివాదానికి దారితీసింది. జొమాటోలో గిగ్ వర్కర్స్ ఐదురోజులపాటు సమ్మె చేపట్టారు. కార్మికుల డిమాండ్లలో కొన్నింటిని నెరవేర్చడానికి యాజమాన్యం అంగీకరించటంతో సమ్మె ముగిసింది.
ఈ సందర్భంగా తమ సమస్యలు ఏంటి? డిమాండ్స్ ఏంటి? అనేది తెలుపుతూ ఒక మెమోరాండాన్ని ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి సమర్పించారు. గిగ్ వర్కర్స్ కోసం ఒక వెల్ఫేర్ ఫండ్‌ను ఏర్పాటుచేయాలని కార్మికులు కోరారు. ఈమేరకు ఎల్డీఎఫ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేయబోతున్నామని రాష్ట్ర మంత్రి వి.శివన్‌కుట్టీ మీడియాకు వెల్లడించారు. మలయాళ దినపత్రిక 'దేశాభిమాని'తో మాట్లాడుతూ, ''గిగ్ వర్కర్స్ డిమాండ్స్ న్యాయమైనవి. వారి డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. కార్మికులకు, ఏజెంట్లకు ఉద్యోగ భద్రత, సరైన వేతనాలు ఇవ్వాలి. ఇందుకోసం న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో..అవి తీసుకుంటా''మని అన్నారు.
యాజమాన్యాలతో మాట్లాడుతాం..
రాష్ట్ర మంత్రి శివన్కుట్టి ఏమన్నారంటే...''గిగ్ వర్కర్స్‌గా పనిచేస్తున్నవారికి ఉద్యోగ భద్రత కల్పించే విధంగా కార్మిక శాఖ చర్యలు చేపట్టింది. వేతనాలు, ఉద్యోగాల నుంచి తొలగింపునకు సంబంధించి కార్మికులు ఫిర్యాదు చేయవచ్చు. వాటిని స్వీకరిస్తాం.
వీటి పరిష్కారానికి యాజమాన్యాలతో మాట్లాడుతాం. మధ్యవర్తిత్వం వహించి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తాం. కార్మికుల ప్రయోజనాలు కాపాడటమే ప్రభుత్వ బాధ్యత. తమ హక్కుల కోసం కార్మికులు లేబర్ కోర్ట్ లేదా ఇండిస్టియల్ ట్రిబ్యునల్‌ను సంప్రదించవచ్చు'' అని అన్నారు.