Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కార్మికులకు అడ్డంకులు
- వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతాలు, మొబైల్ నెంబర్లు సేకరణ
- ప్రయోజనాలు అంతంత మాత్రమేనని నిరాసక్తత
- ప్రయోజనాలపై స్పష్టతనివ్వని కేంద్రం
న్యూఢిల్లీ : అసంఘటిత కార్మికుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా గందరగోళంగా తయారైంది. ఈ-శ్రమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ద్వారా కార్మికులకు అందే ప్రయోజనాలేంటో మోడీ సర్కార్ స్పష్టత ఇవ్వలేదు. కోవిడ్ సంక్షోభం తర్వాత అసంఘటిత కార్మికుల అంశం చర్చనీయాంశమైంది. వారి పేరు, వృత్తి, నైపుణ్యం, చిరునామా..తదితర వివరాలతో ఒక డాటాబేస్ ఏర్పాటుచేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. దేశవ్యాప్తంగా దాదాపు 38కోట్లమంది ఈ-శ్రమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారని తొలుత అంచనావేయగా, నవంబర్ 2021నాటికి కేవలం 9.1కోట్లమందితో డాటాబేస్‌లో పేర్లు నమోదయ్యాయి.
క్షేత్రస్థాయిలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియకు కార్మికుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ఇండ్లలో పనిచేసే కార్మికులు, వీధి వ్యాపారులు, బ్యూటీషియన్స్, వెయిటర్స్, రిక్షా డ్రైవర్లు, నిర్మాణరంగ కార్మికులు..మొదలైనవారంతా రిజిస్ట్రేషన్ కోసం క్యూలో నిలబడుతున్నారు. ఈ-శ్రమ్ పోర్టల్‌లో అడిగే వివరాల్ని ఓపిగ్గా ఇస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల్లో లబ్దిదారులుగా చేర్చుతారని కోట్లాదిమంది ఆశిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న అనుభవాలతో, అడ్డంకులతో కార్మికులు విసిగివేసారి పోతున్నారు.
ఆధార్‌తో ఆరంభం
మొబైల్ ఫోన్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా ఉన్న కార్మికుడు ఎవరైనా 'ఈ-శ్రమ్' పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే ఆధార్ నెంబర్‌తో అనుసంధానించిన ఫోన్ నెంబర్ ఇవ్వాలనే నిబంధన కార్మికుల్ని ఇబ్బంది పెడుతోంది. కారణాలేమైనా కార్మికులు ఒక స్థిరమైన మొబైల్ నెంబర్ వాడటం లేదు. పని కోసం వేరు వేరు ప్రదేశాలకు వెళ్లినప్పుడు మొబైల్ నెంబర్ మార్చాల్సి వస్తోంది. ఒక నెట్వర్క్ సరిగా రావటం లేదని మరో నెంబర్ తీసుకుంటున్నారు. దీనివల్ల మొబైల్ నెంబర్ ఆధార్‌తో అనుసంధానం పెద్ద సమస్యగా మారింది. ఈశ్రమ్ పోర్టల్ ఇవేవీ పరిగణలోకి తీసుకోకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టింది. ఎన్నో ఆశలతో వస్తున్న కార్మికులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేయకుండానే వెనుదిరిగి వెళ్లిపోతున్నారు.
60ఏండ్లు దాటితే రాదు!
చాలామంది కార్మికులకు బ్యాంకు ఖాతాలు లేవు. కొంతమందికి ఉన్నా ఖాతా యాక్టీవ్ లేకపోవటం రిజిస్ట్రేషన్‌కు అడ్డువస్తోంది. అది కూడా ఆధార్‌తో అనుసంధానం చేసిన బ్యాంక్ ఖాతా అయివుండాలి. జన్ ధన్ యోజన కింద మంజూరుచేసిన ఖాతాలన్నీ..స్తబ్దుగా ఉన్నాయి. వాటిలో ఎలాంటి లావాదేవీలు జరగటం లేదని బ్యాంకు అధికారులు 'ఇనాక్టీవ్ మోడ్'లో ఉంచారు. 60ఏండ్లు వచ్చిన వారి వివరాలూ ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదుకావటం లేదు. వారికి ఈ-శ్రమ్ కార్డులు మంజూరు కావటం లేదు. 60ఏండ్లు దాటిన కార్మికులు అసంఘటిత రంగంలో ఎంతోమంది ఉన్నారు. వీరి ఎన్రోల్మేంట్కు వయస్సు అడ్డువస్తోందని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రయోజనాలు కొంతే : మహమ్మద్ అసాద్, తెలంగాణ, జన్ సాహాస్ ఎన్జీవో
ఈ-శ్రమ్ రిజిస్ట్రేషన్ ద్వారా ఎలాంటి ప్రయోజనాలున్నాయన్నది కేంద్రం ఇప్పటివరకూ స్పష్టత ఇవ్వలేదు. ఈ-శ్రమ్ కార్డు ద్వారా కార్మికుడికి ప్రమాద బీమా వస్తుందని మాత్రమే ఒక ఎన్జీవో సంస్థ కార్యకర్తగా చెప్పగలుగుతున్నా. ప్రమాదవశాత్తు చనిపోతే పీఎం సురక్ష బీమా యోజన కింద రూ.2లక్షలు ఇస్తామని కేంద్రం చెబుతోంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడితే రూ.1లక్ష మాత్రమే అందజేస్తోంది. నగదు బదిలీ ద్వారా ప్రభుత్వాలు ప్రయోజనాలు అందిస్తాయని జరుగుతున్న ప్రచారం కార్మికుల్ని ప్రభావితం చేస్తోంది. అలాగే వ్యక్తిగత, కుటుంబ వివరాలు సేకరిస్తున్నారు. బ్యాంకు వివరాలు తీసుకుంటున్నారు. వీటి భద్రతపై అనుమానాలు, పుకార్లు కార్మికుల్లో ఆందోళనను నింపాయి.