Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత యువకుడిపై విచక్షణారహితంగా దాడి
- తీవ్రగాయాలతో బాధితుడు మృతి
న్యూఢిల్లీ : మహారాష్ట్రలో ఒక దళిత యువకుడ్ని తీవ్రంగా కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబయి శివార్లలోని భైందర్ సిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న క్రిష్ణ పలారాంపై దొంగతనం ఆరోపణలు చేస్తూ..ఇనుపరాడ్డు, కర్రలతో ఇమిటేషన్ నగల వ్యాపారి అతడ్ని ఇష్టమున్నట్టు బాదాడు. మే 7న జరిగిన ఈ దాడి ఘటనలో తీవ్రంగా గాయపడ్డ క్రిష్ణ పలారాం చనిపోయాడు. హర్యానాలోని వాల్మీకీ సామాజికవర్గానికి చెందిన క్రిష్ణ పలారాం హత్య ఘటనను స్థానిక పోలీసులు చాలా తేలిగ్గా తీసుకున్నారు. అట్రాసిటీ కేసు నమోదు చేయకుండా ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.
దళిత యువకుడి హత్య ఘటనను సీఐటీయూ అనుబంధ సంఘం సఫాయి శ్రామిక్ యూనియన్, జతియంత్ సంఘర్ష్ సమితి, సీపీఐ(ఎం), మరికొన్ని సంస్థలు తీవ్రంగా ఖండించాయి. దోషుల్ని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి రూ.10లక్షలు నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని సఫాయి శ్రామిక్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ కె.నారాయణన్ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు సీఎం ఉద్ధవ్ థాకరేకు లేఖ కూడా రాశారు. ఘటనపై పోలీసులు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయలేదని, ఇది చాలా సీరియస్ అంశమని లేఖలో ఆయన ప్రస్తావించారు
''ఇమిటేషన్ నగల వ్యాపారి నా కుమారుడ్ని తీవ్రంగా కొట్టాడు. కృష్ణ పలారాం నిజాయితీ గల వ్యక్తి, కష్టపడి పనిచేస్తాడు. ఎప్పుడూ అతడిపై దొంగతనం, ఇతర ఆరోపణలు రాలేదు. నా కొడుకు చావుకు కారణమైన దోషుల్ని కఠినంగా శిక్షించాలి'' అని కృష్ణ తండ్రి తుస్సాడ్ అన్నాడు. హతుడు కృష్ణ పలారాంకు భార్య, ముగ్గురు కూతుర్లు, కొడుకు ఉన్నారు. కృష్ణ చనిపోయాడన్న వార్త బాధితుడి కుటుంబాన్ని షాక్కు గురిచేసింది. ప్రభుత్వం నుంచిగానీ, ఇతర ఉన్నతాధికారులుగానీ ఎవరూ బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదు.