Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18 మాసాల గరిష్టానికి ద్రవ్యోల్బణం
- ద్రవ్య విధాన విఫలమే : నిపుణులు
- రాయిటర్స్ పోల్‌లో వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలో ద్రవ్యోల్బణం దడ పుట్టిస్తుందని ఓ కీలక నిపుణుల సర్వేలో వెల్లడయ్యింది. ప్రస్తుత ఏడాది ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం సూచీ ఏకంగా 18 మాసాల గరిష్ట స్థాయికి చేరొచ్చని రాయిటర్స్ పోల్‌లో తేలింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాలు, నియంత్రిత లక్ష్యానికి కంటే ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది. రాయిటర్స్ మే 5-9 తేదిల్లో 45 మంది ఆర్థిక నిపుణుల అభిప్రాయాలను సేకరించి ఈ రిపోర్ట్‌ను రూపొందించింది. ఆ వివరాలు.. మార్చిలో దేశంలోని ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయిన వెంటనే కేంద్ర ప్రభుత్వం భారీగా చమురు ధరలు పెంచేసింది. దీనికి తోడు ఉక్రెయిన్, రష్యా పరిణామాలు ఇంధన ధరలపై ఒత్తిడిని పెంచాయి.
వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీలో సగం వరకు వాటా కలిగిన అహారోత్పత్తుల ధరలు మార్చిలో బహుళ నెలల గరిష్టానికి చేరగా..ఏప్రిల్‌లో వీటి ధరలు మరింత ఎగిసిపడనున్నాయి. ఈ పరిణామాలతో ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం సూచీ ఏకంగా 7.5 శాతానికి ఎగిసే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. మార్చిలో వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ 6.95 శాతానికి చేరింది. 2020 అక్టోబర్‌లో గరిష్ట స్థాయిలో ద్రవ్యోల్బణం నమోదయ్యింది. ఆ తర్వాత మళ్లీ భారీ స్థాయిలో పెరుగుతోంది. సిపిఐని నాలుగు శాతానికి 2 శాతం అటూ, ఇటుగా నియంత్రించాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ.. ప్రస్తుతం ఈ పరిస్థితి తారుమారైంది. ద్రవ్యోల్బణం ఏడు శాతానికి చేరువలో ఉండటం ఆందోళనకరం. ప్రస్తుత మే మాసంలో ఏకంగా 7-7.85 శాతానికి చేరొచ్చని నిపుణులు అంచనా.
అధిక ఇంధన, అహారోత్పత్తుల ధరలు వినియోగదారుల ద్రవ్యోల్బణాన్ని ఎగిసిపడేలా చేస్తున్నాయని క్యాపిటల్ ఎకనామిక్స్ సీనియర్ ఇండియా ఎకనామిస్ట్ శైలాన్ షా పేర్కొన్నారు. ఇటీవల పెట్రో ధరల పెంపు మరింత ఒత్తిడిని పెంచుతున్నాయన్నారు. అధిక దిగుమతుల బిల్లు వల్ల ఈ ఏడాది రూపాయి విలువ 4 శాతం పడిపోయే అవకాశం ఉందని అంచనా. దేశంలో టోకు ద్రవ్యోల్బణం సూచీ ఏకంగా రెండంకెల స్థాయికి తగ్గకుండా.. 14.48 శాతానికి ఎగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆర్బీఐ రెపోరేటును 40 బేసిస్ పాయింట్లు పెంచి 4.4 శాతానికి చేర్చింది. ద్రవ్యోల్బణం ఆర్బిఐ నియంత్రిత లక్ష్యానికి మించి పెరిగిందని.. ఇది ద్రవ్య నియంత్రణ పాలసీ విధాన విఫలమేనని బార్క్లేస్ చీఫ్ ఇండియా ఎకనామిస్ట్ రాహుల్ బజోరియా విమర్శించారు.