Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కేంద్ర హౌం సహాయ మంత్రి అజరు కుమార్ మిశ్రా రాజీనామా చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) డిమాండ్ చేసింది. లఖింపూర్ ఖేరీ టికునియా హత్య కేసులో ఆశిష్ మిశ్రా మోను, అతని సహచరుల బెయిల్ కూడా తిరస్కరించినట్టు తెలిపింది. ఆశిష్ మిశ్రా సహచరుల బెయిల్ దరఖాస్తును కొట్టివేయడాన్ని ఎస్కేఎం స్వాగతిస్తుందని పేర్కొంది. కేంద్ర హౌం సహాయ మంత్రి అజరు కుమార్ మిశ్రా ప్రవర్తనపై కోర్టు వ్యాఖ్యానించిన తర్వాత, ఆయన మంత్రిగా కొనసాగడం సబబు కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం ఎస్కేఎం నేతలు దర్శన్ పాల్, హన్నన్ మొల్లా, జగ్జిత్ సింగ్ దల్లేవాల్, జోగిందర్ సింగ్ ఉగ్రహన్, శివకుమార్ శర్మ (కాక్కా జీ), యుధ్వీర్ సింగ్, యోగేంద్ర యాదవ్ సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. లఖింపూర్ ఖేరీ హత్య కేసులో ప్రధాన నిందితుడు, కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా సహచరుల బెయిల్ దరఖాస్తులను అలహాబాద్ హైకోర్టు కొట్టివేయడాన్ని ఎస్కేఎం స్వాగతిస్తుందని తెలిపారు. కోర్టు ఆదేశంలో హౌంశాఖ మంత్రి వ్యవహారశైలిపై చేసిన వ్యాఖ్యల తర్వాత అజరు మిశ్రా తేని మంత్రి పదవిలో కొనసాగడం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. ఆశిష్ మిశ్రా బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత న్యాయ చక్రం సరైన దిశలో తిరగడం ప్రారంభించిందని ఈ ఉత్తర్వు ఆశాజనకంగా ఉందని తెలిపారు.
అంకిత్ దాస్, శిశుపాల్, సుమిత్ జైస్వాల్, లవకుష్ల బెయిల్ దరఖాస్తులను అలహాబాద్ హైకోర్టులోని లక్నో డివిజన్ బెంచ్‌లో జస్టిస్ దినేష్ కుమార్ సింగ్ తిరస్కరించారు. నిందితులు చేసిన వాదనలన్నింటినీ తోసిపుచ్చిన హైకోర్టు, నిందితుల రాజకీయ పలుకుబడిని ఎత్తిచూపుతూ, అటువంటి పరిస్థితిలో సాక్ష్యాధారాలను ధ్వంసం చేసి సాక్షులపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొందని తెలిపారు. అంతే కాదు జస్టిస్ దినేష్ కుమార్ సింగ్ తన ఆర్డర్లో కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా టెనీ ప్రవర్తనపై ఘాటైన వ్యాఖ్య చేశారు. ''ఈ సంఘటన జరగకపోయేది. కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి వ్యాఖ్యలు వల్లే జరిగింది. చాలా మంది అమాయకుల ప్రాణాలు పోయాయి. అత్యంత క్రూరమైన, అనాగరికమైన, భయంకరమైన, అమానవీయమైన రీతిలో ఘటన జరిగింది'' అని పేర్కొందని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్ కూడా ఈ కేసులో పెద్ద కుట్రగా భావించి అదే బాట పట్టడం ఇక్కడ ప్రస్తావించదగ్గ విషయమని తెలిపారు. సంయుక్త కిసాన్ మోర్చా మొదటి రోజు నుంచి ఈ మారణకాండకు సూత్రధారి అజరు మిశ్రా టేని అని పేర్కొంటోందని, ఇప్పుడు హైకోర్టు ఈ వ్యాఖ్యల తర్వాత మంత్రి మండలిలో మంత్రి టేని కొనసాగడం సబబు కాదని పేర్కొన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా, దాని న్యాయవాద బృందం న్యాయవాదులు శశాంక్ సింగ్, అమన్ ఖవాజాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆశిష్ మిశ్రా బెయిల్ పిటిషన్‌ను పున్ణపరిశీలించేటప్పుడు కూడా కోర్టు ఈ వాస్తవాలన్నింటినీ పరిగణిస్తుందని భావిస్తోన్నామన్నారు.