Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ పాలనలో విరివిగా ప్రయోగం
- బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అధికం
- ప్రభుత్వ గణాంకాలతో బహిర్గతం
- రాజద్రోహ చట్టంపై ఇప్పటికే ప్రశ్నించిన 'సుప్రీం'
న్యూఢిల్లీ: బ్రిటీషు కాలం నాటి రాజద్రోహం చట్టాన్ని మోడీ ప్రభుత్వం తన పాలనా కాలంలో విరివిగా ఉపయోగిస్తున్నది. దేశంలో రాజద్రోహం చట్టాన్ని అప్పటి బ్రిటీషు ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రభుత్వ యంత్రాంగానికి వ్యతిరేకంగా విమర్శలు ఎక్కుపెట్టేవారికి, భారత స్వాతంత్య్ర సమరయోధులకు వ్యతిరేకంగా బ్రిటీషు సర్కారు ఈ చట్టాన్ని ఉపయోగించింది. బాల గంగాధర్ తిలక్, గాంధీ వంటి ప్రముఖులు కూడా ఈ చట్టానికి బాధితులుగా మిగిలారు. ఇప్పుడు మోడీ సర్కారు కూడా అప్పటి బ్రిటీషు ప్రభుత్వ అడుగుజాడల్లో నడుస్తున్నదని రాజకీయ విశ్లేషకులు ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక విమర్శలను సహించటం లేదన్నారు. అలాంటి చర్యలకు పాల్పడేవారిని 'రాజద్రోహం' అనే ఆయుధంతో వారి గొంతులను అణచివేస్తున్నదని చెప్పారు. 2014లో కేంద్రంలో మోడీ సారి తొలిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి బీజేపీ ప్రభుత్వం ఈ రాజద్రోహం చట్టాన్ని కఠినంగా ప్రయోగిస్తున్నది. ఇందుకు కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ), నేషనల్ రికార్డ్స్ ఆఫ్ క్రైమ్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వెల్లడించిన గణాంకాలే నిదర్శనం.
ఇప్పటికే ప్రశ్నించిన సుప్రీంకోర్టు
సామాజిక కార్యకర్తలు, ప్రజాసంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, రైతులు, విద్యార్థులు, దళిత సంఘాల నాయకులు.. ఇలా ఏ ఒక్కరినీ విడిచిపెట్టడం లేదదని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు. వారందరి పైనా రాజద్రోహం కేసులను మోపిందన్నారు. పౌరుల స్వేచ్ఛను అణచివేయడానికే ఈ చట్టాన్ని తెచ్చారని గాంధీ అప్పట్లో విమర్శించారు కూడా. స్వాతంత్య్రం సాధించి ఇటు 75 ఏండ్లు అవుతున్నది. మోడీ ప్రభుత్వం 'ఆజాదీ కా అమృత్ మహౌత్సవ్' కార్యక్రమాన్ని దేశమంతటా నిర్వహిస్తున్నది. కానీ, పౌరుల స్వేచ్ఛను హరించే, వారి గొంతును అణచివేసే ఈ చట్టాన్ని మాత్రం మోడీ సర్కారు రద్దు చేసే ప్రయత్నాన్ని చేయటం లేదని విశ్లేషకులు తెలిపారు. పైగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే రాజద్రోహం కేసులు దేశంలో పెరిగిపోవటం గమనించాల్సిన అంశం. దీంతో దేశ సర్వోన్నత న్యాయస్థానమే ఈ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించటం గమనార్హం.
2014 నుంచి కేసుల్లో పెరుగుదల
2019, 2020 లలో రాజద్రోహం కేసులు పెరిగిపోయాయి. కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ), నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ల సమాచారం ప్రకారం.. 2014 నుంచి రాజద్రోహం కేసులు వేగంగా పెరిగాయి. 2010 నుంచి మొత్తం 10,938 మంది భారతీయులపై రాజద్రోహం కేసులు నమోదయ్యాయి. ఇందులో 65 శాతం మందిపై కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాతనే కేసులు నమోదు కావటం గమనార్హం. వీరిలో రాజకీయ నాయకులు, విద్యార్థులు, జర్నలిస్టులు, రచయితలు, విద్యావేత్తలు ఉన్నారు. ఐపీసీలోని సెక్షన్ 124ఏ కింద రాజద్రోహం పరిధులను నిర్వచించాల్సిన అవసరమున్నదని గతేడాది మే ఒక కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. గతేడాది జులైలో రాజద్రోహంపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ వివాదాస్పద చట్టం అమలును భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణ ప్రశ్నించారు. '' రాజద్రోహం ఒక వలస చట్టం. ఇది స్వేచ్ఛను హరిస్తుంది. గాంధీ, తిలక్ వంటి వారిపై ఈ చట్టాన్ని ఉపయోగించారు. 75 ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా ఈ చట్టం అవసరంమా?'' అని ఆయన విమర్శించారు.
బీజేపీ ప్రభుత్వం కేంద్రంలోకి అదికారంలోకి వచ్చిన తర్వాత, ఇటు రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు రాజద్రోహం చట్టాన్ని ఆయుధంగా మలుచుకున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక విమర్శలు, నిరసనలు వెల్లువెత్తినప్పుడు 'రాజద్రోహం' చట్టాన్ని డీ-ఫ్యాక్టో స్ట్రాటజీగా వినియోగించాయి. ఇలాంటి సమయాల్లోనే రాజద్రోహం కేసులు అధికమయ్యాయి.
మోడీ పాలనలోనే 65 శాతం మందిపై కేసులు
2010 నుంచి 816 రాజద్రోహం కేసుల్లో దాదాపు 11 వేల మందిపై అభియోగాలు మోపారు. ఇందులో 65 శాతం మందిపై కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే అభియోగాలు నమోదు కావటం గమనార్హం. ఇక రాజకీయ నాయకులు, ప్రభుత్వాన్ని విమర్శించినందుకు నమోదైన రాజద్రోహం కేసుల్లో నిందితులుగా ఉన్న 405 మంది భారతీయుల్లో 95 శాతం మందిపై 2014 తర్వాతే అభియోగాలు నమోదయ్యాయి. ఇందులో 149 మంది ప్రధాని మోడీపై, 144 మంది యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై విమర్శలు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో కేసులు నమోదు కావటం గమనార్హం. 2010-14 మధ్య యూపీఏ-2 కాలం నాటి కేసులతో చూసుకుంటే 2014 నుంచి 2020 మధ్య (మోడీ కాలంలో) దాఖలైన రాజద్రోహం కేసుల్లో ప్రతి ఏడాది 28 శాతం పెరుగుదల నమోదు కావటం గమనార్హం.
మొదటి నాలుగు బీజేపీ రాష్ట్రాలే..!
2010-20 మధ్య రాజద్రోహం కేసులు అత్యధికంగా నమోదైన ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలే కావటం గమనార్హం. వీటిలో బీహార్, యూపీ, కర్నాటక, జార్ఖండ్‌లున్నాయి. యూపీలో 2010 నుంచి దాఖలైన 115 కేసుల్లో 77 శాతం కేసులు గత నాలుగేండ్లలోనే నమోదు కావటం ఆందోళనకరం. ఇదే కాలంలో తమిళనాడులో 139 రాజద్రోహం కేసులు నమోదయ్యాయి. ఇందులో 80 శాతం కేసులు కూడంకుళం న్యూక్లియర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్నవారి పైనే నమోదు కావటం గమనించాల్సిన అంశం.
ఐదేండ్లలో 326 కేసులు
భారత్‌లో 2014-2019 మధ్య 326 రాజద్రోహం కేసులు రిజిస్టరయ్యాయి. వీరిలో 141 కేసుల్లోనే చార్జీషీట్లు నమోదయ్యాయి. ఆరుగురు మాత్రమే దోషులుగా తేలటం గమనార్హం. 54 రాజద్రోహం కేసులతో అసోం ఈ జాబితాల్లో తొలిస్థానంలో ఉన్నది. ఆ తర్వాతి స్థానాల్లో జార్ఖండ్ (40), హర్యానా (31), బీహార్ (25), జమ్మూకాశ్మీర్ (25), కర్నాటక (22) లు ఉన్నాయి.
2019లో అధికం
2014లో మొత్తం 47 రాజద్రోహం కేసులు నమోదయ్యాయి. 2015లో 30, 2016లో 35, 2017లో 51, 2018లో 70, 2019లో 93 కేసులు రికార్డయ్యాయి. 2019లో రాజద్రోహం కింద అదుపులో ఉన్నవారిలో ఒక మహిళతో సహా మొత్తం 55 మంది 18 నుంచి 30 ఏండ్ల మధ్యవారే కావటం గమనార్హం. 2016-19 మధ్య రాజద్రోహం కేసులు 160 శాతం పెరిగాయి.