Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ కేసులపై విచారణ నిలిపివేత
- కొత్త కేసులు నమోదు చేయొద్దు
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు ఆదేశం
- జైల్లో ఉన్నవారు సంబంధిత కోర్టులను ఆశ్రయించవచ్చునని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: వలస పాలకుల నాటి రాజద్రోహం చట్టం (ఐపీసీ సెక్షన్ 124 ఏ) అమలుపై అత్యున్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి కొత్త కేసులు నమోదు చేయొద్దని ఆదేశించింది. అంతేకాదు.. ఇప్పటికే నమోదైన కేసులపై చర్యలు తీసుకోవద్దనీ, విచారణ తాత్కాలికంగా నిలిపివేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. మానవ హక్కులు, దేశ సమగ్రత మధ్య సమతుల్యతను పాటించాల్సిన అవసరం కూడా ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 124ఏ సెక్షన్ కింద జైల్లో ఉన్నవారు సంబంధిత కోర్టులను ఆశ్రయించవచ్చునని సూచించింది. రాజద్రోహం చట్టం సెక్షన్ 124ఏను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. దీనిపై ధర్మాసనం కీలక ఉత్తర్వులు వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం పున్ణపరిశీలన పూర్తయ్యేవరకూ.. ఈ చట్టం అమలుపై స్టే విధించింది. రాజద్రోహ చట్టాన్ని సమీక్షించనున్న నేపథ్యంలో ఈ చట్టం కింద ఇప్పటికే నమోదైన కేసులు, భవిష్యత్తులో నమోదయ్యే కేసుల గురించి ప్రభుత్వం ఎటువంటి వైఖరి అనుసరించబోతుందో స్పష్టం చేయాలని సుప్రీంకోర్టు మంగళవారం కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. సమీక్ష పూర్తయ్యే వరకు ఆ చట్టం కింద కేసులు నమోదు చేయకుండా రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేయవచ్చు కదా అని సూచించింది. దీనిపై కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మోహతా బుధవారం కోర్టుకు వివరణ ఇచ్చారు. ''సమీక్ష పూర్తయ్యేంత వరకు ఈ చట్టం కింద కేసులు నమోదు చేయకుండా నిలిపివేయడం అనేది సరైన విధానం కాదు. తీవ్రమైన నేరాల్లో కేసులు నమోదు చేయకుండా ఉండలేం. ప్రతి కేసు తీవ్రతను చెప్పలేం. కొన్ని ఉగ్రకోణంలో ఉండొచ్చు. లేదా మనీలాండరింగ్ కేసులైనా కావొచ్చు. అయితే ఈ కేసులను పరిశీలించేందుకు ఓ ఆఫీసర్ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఎస్పీ ర్యాంక్ అధికారి నేర తీవ్రతను పరిశీలించి ఆమోదిస్తేనే కేసు నమోదు చేసేలా మార్గదర్శకాలు రూపొందించాలనుకుంటున్నాం. పెండింగ్ కేసులను న్యాయపరమైన ఫోరమ్ ముందు పరిశీలించాలి'' అని తుషార్ మోహతా వివరించారు. అయితే కేంద్ర ప్రభుత్వ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. పౌరుల హక్కులు, దేశ సమగ్రత మధ్య సమతుల్యత అవసరమని సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ అభిప్రాయపడ్డారు. ''ఈ చట్టాన్ని పున్ణ పరిశీలిస్తామని కేంద్రం చెప్పింది. చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పిటిషనర్లు వాదిస్తున్నారు. హనుమాన్ చాలిసా పఠించినా రాజద్రోహం అభియోగాలు మోపుతున్నారని అటార్నీ జనరల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చట్టంపై సమీక్ష పూర్తయ్యేంత వరకూ రాజద్రోహ చట్టాన్ని ఉపయోగించడం సరికాదు. అందువల్ల పున్ణపరిశీలన పూర్తయ్యేంత వరకు దీని అమలుపై స్టే విధిస్తున్నాం. అప్పటిదాకా ఈ చట్టం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి కొత్త కేసులు నమోద చేయబోవని విశ్వసిస్తున్నాం. ఒకవేళ కొత్త కేసులు నమోదు చేస్తే వారు కోర్టును ఆశ్రయించవచ్చు'' అని సీజేఐ స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ కేసులో జైలులో ఉన్నవారు కూడా బెయిల్ కోసం న్యాయస్థానాలకు వెళ్లవచ్చని సీజేఐ సూచించారు. అనంతరం దర్మాసనం తదుపరి విచారణను జూలై మూడో వారానికి వాయిదా వేసింది.
ప్రజాస్వామ్య విజయం : మహువా మొయిత్రా, టీఎంసీ
ఇది ప్రజాస్వామ్య విజయమని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి గొప్ప రోజని పేర్కొన్నారు. సుప్రీంకోర్టుకు అభినందనలని తెలిపారు.
బీజేపీ గుణపాఠం నేర్చుకోవాలి : మెహబూబా ముఫ్తీ, పీడీపీ
బీజేపీ గుణపాఠం నేర్చుకోవాలని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ అన్నారు. దేశంలోని విద్యార్థులు, కార్యకర్తలు, జర్నలిస్టులపై రాజద్రోహ ఆరోపణలను కొనసాగిస్తే, మన పరిస్థితి శ్రీలంక కంటే దారుణంగా మారుతుందని అన్నారు. పొరుగు దేశం నుంచి బీజేపీ గుణపాఠం నేర్చుకోవాలని సూచించారు.
సుప్రీం కోర్టుకు సెల్యూట్ : ప్రశాంత్ భూషన్
రాజద్రోహ చట్టాన్ని ప్రబలంగా దుర్వినియోగం చేయకుండా నిరోధించే ఈ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినందుకు సుప్రీంకోర్టుకు సెల్యూట్ అని సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషన్ పేర్కొన్నారు.
ఈ చట్టాన్ని రద్దు చేయాలి : ఏచూరి
రాజద్రోహ చట్టాన్ని రద్దు చేయాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. రాజద్రోహ చట్టాన్ని సీపీఐ(ఎం) వ్యతిరేకిస్తున్నదనీ, ఈ చట్టాన్ని స్వాతంత్య్రోద్యమాన్ని అణచివేయడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. అన్ని రాజద్రోహ కేసులను నిలిపివేయాలనీ, కొత్త కేసులను నమోదు చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించిందని తెలిపారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజద్రోహ చట్టం కింద 326 మంది అరెస్టు చేశారని వివరించారు. అందులో కేవలం ఆరు కేసులనే కోర్టులు నిర్థారించాయని అన్నారు. ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ పుస్తకాల నుంచి తొలగించాలని కోరారు. జూలైలో జరిగే విచారణలో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
చారిత్రాత్మక తీర్పు : సీపీఐ
రాజద్రోహ చట్టంపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును సీపీఐ స్వాగతించింది. చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసింది. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా 2011లోనే రాజ్యసభలో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారని గుర్తు చేసింది. ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక నియంతృత్వ చట్టమని పేర్కొంది.
నిజం చెప్పడం దేశభక్తి... : రాహుల్ గాంధీ
నిజం చెప్పడం దేశభక్తి అనీ, రాజద్రోహం కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. రాజద్రోహం చట్ట అమలును నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఆయన స్పందించారు. సత్యాన్ని వినడం కర్తవ్యమనీ, సత్యాన్ని అణిచివేయడం అహంకారమని పేర్కొన్నారు.
లక్ష్మణ రేఖ దాటొద్దు : కిరణ్ రిజిజు
సుప్రీంకోర్టు ఆదేశాలపై స్పందించిన కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కోర్టులు లక్ష్మణ రేఖ దాటొద్దని అన్నారు. కోర్టులకు ఉన్న స్వతంత్ర హోదాను, వాటి తీర్పును గౌరవిస్తామని అన్నారు. అంతేకాదు లక్ష్మణ రేఖను దాటకూడదు కదా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టం విషయంలో మేం చాలా స్పష్టంగా ఉన్నామనీ, తమ ప్రధాని నరేంద్ర మోడీ ఉద్దేశం ఏంటో కూడా న్యాయస్థానానికి తెలియజేశామని అన్నారు.