Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు విడుదల
న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నియామక ఉత్తర్వులను విడుదల చేసింది. మే 14తో ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర పదవీకాలం పూర్తి కానుంది. ఆయన 2020 సెప్టెంబర్ 1 ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలోనే మే 15న నూతన సీఈసీగా రాజీవ్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. న్యాయ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 324లోని క్లాజ్(2) ప్రకారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నియామకాన్ని చేపట్టారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సామాజిక మాధ్యమంలో ట్వీట్ చేశారు. బీహార్, జార్ఖండ్ కేడర్ 1984 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్, 2020 ఫిబ్రవరిలో ఐఏఎస్ నుంచి పదవీ విరమణ పొందారు. అతను ఏప్రిల్ 2020లో పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ (పీఈఎస్బీ) చైర్మెన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2020 సెప్టెంబర్ 1న ఎన్నికల కమిషనర్‌గా కేంద్ర ఎన్నికల సంఘంలో చేరారు. ఆయన సామాజిక, పర్యావరణం, అటవీ, మానవ వనరులు, ఆర్థిక, బ్యాంకింగ్ రంగాలలో వివిధ కేంద్ర, రాష్ట్ర మంత్రిత్వ శాఖలలో 36 సంవత్సరాల ప్రభుత్వ సేవల్లో పనిచేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఎస్బీఐ, నాబార్టులలో డైరెక్టర్‌గా కూడా రాజీవ్ కుమార్ పనిచేశారు. ఎకనామిక్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ (ఈఐసీ) సభ్యుడుగా, బ్యాంక్ బోర్డ్ బ్యూరో (బీబీబీ) సభ్యుడు, ఫైనాన్షియల్ సెక్టార్ రెగ్యులేటరీ అపాయింట్మెంట్స్ సెర్చ్ కమిటీ (ఎఫ్ఎస్ఆర్ఏఎస్సీ) సభ్యుడు, సివిల్ సర్వీసెస్ బోర్డ్ వంటి అనేక ఇతర బోర్డులు, కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు.