Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వికలాంగ ప్రయాణికులను గౌరవంగా చూడాలని నేషనల్ ఫ్లాట్ఫార్మ్ ఫర్ ది రైట్స్ ఆఫ్ ది డిసేబుల్డ్ (ఎన్పీఆర్డీ) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంస్థ ప్రధాన కార్యదర్శి మురళీధరన్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 8న రాంచీ విమానాశ్రయంలో వికలాంగ బాలుడ్ని విమానం ఎక్కుకుండా అడ్డుకోవడాన్ని దురదృష్ట సంఘటనగా ప్రకటన పేర్కొంది. తన సిబ్బంది చేసిన క్షమించరాని పనిని ఇండిగో సీఈఓ అవమానకరమైన రీతిలో సమర్థించడమే కాకుండా, దీనిని భద్రతాపరమైన సమస్యగా వాదించారని. అయితే తరువాత రోజే ఆ బాలుడ్ని విమానం ఎక్కడానికి అనుమతించడం సమాధానం లేని ప్రశ్నగా ప్రకటన వర్ణించింది. వికలాంగ ప్రయాణికుల కోసం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రత్యేక నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించిందని తెలిపింది. ఈ మార్గదర్శకాల ప్రకారం వికలాంగ ప్రయాణికులకు సహాయం చేయడం కోసం అన్ని విమానయాన సంస్థలు తమ సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందని ప్రకటన గుర్తు చేసింది. ఇండిగో ఈ మార్గదర్శకాలును ఉల్లంఘించడం శిక్షార్హమైన నేరంగా తెలిపింది. అయితే దురదృష్టవశాత్తూ వివిధ విమానయాన సంస్థలు పదేపదే ఈ నేరాలు చేసినప్పటికీ డీజీసీఏ ఒక్క సందర్భంలోనూ స్పందించడం లేదని ఎన్పీఆర్డీ విమర్శించింది. విమానాల్లో మాత్రమే కాదు, బస్సుల్లోనూ, రైళ్లలోనూ అవమానాలు, వేధింపులు, వివక్షను ఎదుర్కొవడం వికలాంగ ప్రయాణికుల దినచర్యగా మారిందని ప్రకటనలో ఎన్పీఆర్డీ ఆవేదన వ్యక్తం చేసింది. 'దివ్యాంగ్' అని పేరు పెట్టడంతో సరిపోదని, వికలాంగులను గౌరవంగా చూడాలని విజ్ఞప్తి చేసింది.