Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీలోని మదన్‌పూర్ ఖాదర్‌లో కూల్చివేత కార్యక్రమం ప్రారంభం
- ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని మదన్‌పూర్ ఖాదర్‌లో భారీ నిరసనలు చెలరేగాయి. ఈ నిరసనల మధ్యే ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టింది. కూల్చివేతలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వార్త కథనాల ప్రకారం.. బుల్డోజర్లు ఆ ప్రాంతంలోని ఆరు అంతస్థుల భవనాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించాయి. కూలీలు భవనం గోడలను లోపలి నుంచి బద్దలు కొట్టడం కనిపించింది. నిరసన ప్రదర్శనలు ఆపాలని పోలీసులు ఆందోళనకారులను హెచ్చరించారు. నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జీ చేయడం కూడా కనిపించింది. ఆక్రమణల వ్యతిరేక డ్రైవ్ రాజకీయ ప్రేరేపితమని ప్రతిపక్షాలు ఆరోపించాయి. మదన్‌పూర్ ఖాదర్‌కు వెళ్లిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేదల ఇండ్లను కాపాడటానికి తాను జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమేనని అమానతుల్లా తెలిపారు. ఇక్కడ ఎలాంటి ఆక్రమణలు ఏలవని అన్నారు. ఈనెల 9న షాహీన్‌బాగ్‌లో కూల్చివేత కార్యక్రమాన్ని అడ్డుకున్నారనే ఆరోపణలతో దాఖలైన ఎఫ్ఐఆర్లో ఖాన్ పేరు కూడా ఉన్నది. ముఖ్యంగా, అమానతుల్లాపై కేసు నమోదు చేయాలని కోరుతూ బీజేపీ ఢిల్లీ యూనిట్ చీప్ ఆదేశ్ గుప్తా దక్షిణ ఢిల్లీ మేయర్‌కు లేఖ రాసిన కొన్ని గంటల తర్వాత మునిసిపల్ కార్పొరేషన్ చర్యలు తీసుకోవడం గమనార్హం. మరోవైపు ప్రేమ్‌నగర్‌లో మరో కూల్చివేత కార్యక్రమం జరిగిందని ఏఎన్ఐ నివేదించింది. గత నెల నుంచి మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ అనేక ప్రాంతాల్లో 'ఆక్రమణ వ్యతిరేక' డ్రైవ్ పేరుతో కూల్చివేత ప్రక్రియను కొనసాగిస్తున్న విషయం విదితమే.