Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణలో రెండు, ఏపీలో నాలుగు స్థానాలు ఖాళీ
న్యూఢిల్లీ : రాజ్యసభ ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఖాళీ కానున్న రాజ్యసభ సీట్ల కోసం మే 24న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నదని, మే 31 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలుకానుంది. జూన్ 1న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, నామినేషన్ల ఉపసంహరణకు గడువు జూన్ 3గా ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. జూన్ 10న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయని, పోలింగ్.. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. మొత్తం 57 సీట్లలో.. తెలంగాణ నుంచి రెండు సీట్లు, ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు సీట్లను భర్తీ చేయాల్సి ఉంది. తెలంగాణ నుంచి కెప్టెన్ లక్ష్మీకాంత్, ధర్మపురి శ్రీనివాస్ల పదవీకాలం జూన్ 21తో ముగియనుంది. ఏపీ నుంచి ఎంపీలు విజయసాయి రెడ్డి, సురేష్ ప్రభు, టిజి వెంకటేష్,సుజనా చౌదరిల పదవీకాలం జూన్ 21తో ముగియనుంది. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి పియూష్ గోయల్, కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కాంగ్రెస్ నేతలు పి. చిదంబరం, కపిల్ సిబల్, జైరాం రమేష్, అంబికా సోని, ఛాయావర్మ,బీజేడీ నేత ప్రసన్న ఆచార్య, ఎన్సీపి నేత ప్రఫుల్ పటేల్, శివసేన నేత సంజరు రౌత్, బీఎస్పీ నేత సతీష్ చంద్ర మిశ్రా, ఆర్జేడి నేత మీసా భారతి,జెడియు నేత, కేంద్ర మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్ తదితరులు పదవీ విరమణ కానున్నారు. జూన్ 29తో ఛత్తీస్గఢ్ (2), మధ్యప్రదేశ్ (3),తమిళనాడు (6), జూన్ 30తో కర్నా టక (4), జులై 1తో ఒడిశా 3,జూలై 4తో మహారాష్ట్ర (6), పంజాబ్ (2), రాజస్థాన్ (4), ఉత్తర ప్రదేశ్ (11), ఉత్తరాఖండ్ (1), జులై 7తో బీహార్ (5), జార్ఖండ్ (2), ఆగ ష్టు 1తో హర్యానా (2) రాజ్యసభ స్థానాలకు పదవీకాలం పూర్తి కానున్నది.
రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల మే 24
నామినేషన్ల స్వీకరణ మే 31
నామినేషన్ల పరిశీలన జూన్ 1
నామినేషన్ల ఉపసంహరణ జూన్ 3
పోలింగ్ జూన్ 10 (ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు)
ఓట్ల లెక్కింపు జూన్ 10 (సాయంత్రం 5 గంటలకు నిర్వహించి ఫలితాలు వెల్లడి)