Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీలో నిలిచిపోయిన ఉచిత రేషన్ సరుకుల పథకం
- అసెంబ్లీ ఎన్నికలకు ముందు రెండుమార్లు సరుకుల పంపిణీ
- ఉపాధి హామీ, ఉచిత రేషన్‌ను చూపి..ఆర్భాటం
- ఎన్నికలు ముగిసాక..వాటి ఊసే ఎత్తని సర్కార్
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు ఉన్న ముచ్చట ఇప్పుడు లేదు. పేదలు, మధ్య తరగతికి ఇచ్చిన ఎన్నికల వాగ్దానాల్ని యోడీ సర్కార్ కొద్ది నెలల్లోనే మరిచిపోయింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఉప్పు, పప్పు, చక్కెర, గోధుమలు, వంటనూనె..ఇలా అనేకం ఉచిత రేషన్ ద్వారా ప్రజలకు అందజేస్తున్నామని ఎన్నికలకు కొద్ది నెలలముందు బీజేపీ సర్కార్ ఊదరగొట్టింది. అధికారంలోకి వచ్చి మూడు నెలలుకాగానే ఉచిత రేషన్ పథకాన్ని అటకెక్కించింది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది పేద కుటుంబాలకు ఉచిత రేషన్ సరుకులు అందటం లేదు. దీనికి సంబంధించి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా పట్టించుకునే నాథుడెవరూ ప్రభుత్వంలో లేరు.
అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు యోగి సర్కార్ ఉచిత రేషన్ సరుకుల పథకాన్ని తీసుకొచ్చింది. ఓటర్లను పెద్దఎత్తున ఈ పథకం ఆకర్షించింది. అలాగే ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ (నరేగా పథకాన్ని) నిధుల్ని వెచ్చించింది. దళితులు, అణగారిన వర్గాలకు చెందినవారు, వ్యవసాయ కూలీలకు కొద్ది నెలలు పని దొరికింది. ఇప్పుడు ఎన్నికలు ముగిసిన వెంటనే నరేగా, ఉచిత రేషన్ అమలు గాలికి వదిలేసింది. ఓట్ల అవసరం ఉన్నంత వరకు పథకాల అమలుతో ఊదరగొట్టిన యోగి సర్కార్, ఇప్పుడు ప్రజల సమస్యల్ని పట్టించుకోవటం లేదు.
ఉదాహరణకు..చందౌలీ జిల్లాలో భారుడా గ్రామంలో దళితులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఉచిత రేషన్ పథకం ప్రకటించిన తర్వాత రెండుసార్లు సరుకులు ఇచ్చారని, ఎన్నికలు ముగిసాక సరుకులు రావటం లేదని ఆ గ్రామానికి చెందిన రామేశ్వర్ ప్రసాద్ చెప్పారు. రేషన్ డీలర్ దగ్గరికి వెళ్లి అడిగితే..సరుకుల కొరత ఉందని చెబుతున్నాడట. ఛాకియా గ్రామానికి చెందిన గీతారారు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ''ఐదుగురు సభ్యులున్న కుటుంబం మాది. ఉచిత రేషన్ సరుకుల కోసం వెళ్లటం..ఉత్తచేతులతో రావటం పరిపాటిగా మారింది. ఎన్నికలయ్యాక ఇవ్వట్లేదు'' అని వాపోయారు.