Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యర్థులపై బెదిరింపులు
- మోడీపై విరుచుకుపడ్డ సోనియా గాంధీ
- కాంగ్రెస్ చింతన్ శివిర్ ప్రారంభం
ఉదయ్ పూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ శుక్రవారం తీవ్ర విమర్శలు చేశారు. మైనార్టీలను హింసిస్తున్నారనీ, దేశాన్ని విభజిస్తున్నారనీ, రాజకీయ ప్రత్యర్థుల్ని బెదిరిస్తున్నారని మోడీపై సోనియా
విమర్శలు గుప్పించారు. రాజస్థాన్లోని ఉదయ్ పూర్లో మూడు రోజుల పాటు జరిగే కాంగ్రెస్ చింతన్ శివిర్ శుక్రవారం ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ నవ సంకల్ప్ చింతన్ శివిర్ పేరుతో జరుగుతున్న సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రారంభోపన్యాసం చేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా పార్టీని బలమైన శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కాంగ్రెస్ నాయకులకు పిలుపునిచ్చారు. అలాగే ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. మోడీ అతని మంత్రులు ఎప్పుడూ చెప్పే కనిష్ఠ ప్రభుత్వం గరిష్ఠ పాలన నినాదానికి అర్థం ప్రజల్లో చీలిక తేవడం, మైనార్టీలపై దాడులు, రాజకీయ ప్రత్యర్థులను బెదిరించడమేనన్నారు. దేశాన్ని శాశ్వతంగా చీలిక స్థితిలో ఉంచడం, ప్రజలు నిరంతరం భయం, అభద్రతలో బతికేలా చేయడమే దాని అర్థమని విమర్శించారు. మోడీ పాలనలో ప్రజలు భయంభయంగా బతుకుతున్నారని అన్నారు. మైనార్టీలను హింసిస్తున్నారని, గాంధీజీని చంపిన వాళ్లను కీర్తిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. దేశంలో సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని సోనియా ఆందోళన వ్యక్తంచేశారు. మోడీ పాలన ఇకపై కూడా కొనసాగితే దేశం అనేక సవాళ్లను, ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మోడీని దీటుగా ఎదుర్కొనేందుకు, పార్టీని ప్రబల శక్తిగా తీర్చిదిద్దేందుకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చి దేశ సమగ్రతను నిలబెట్టేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. మతపరమైన విభజనను ఎదుర్కొని దేశాన్ని పునర్మించాలనే లక్ష్యంతో మున్ముందు పనిచేయాలని నిర్దేశించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాల ఫలితంగా దేశం ఎదుర్కొంటోన్న అనేక సవాళ్లపై చర్చించేందుకు ఈ సదస్సు అవకాశం కల్పిస్తోందని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో సత్వరమే సంస్థాగత మార్పులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. నేతల పనితీరులోనూ మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఈ సదస్సులో నేతలు తమ అభిప్రాయాలను బహిరంగంగా చెప్పాలని, అయితే పార్టీ బలంగా, ఐక్యంగా ఉందనే సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలని చెప్పారు. పార్టీ వ్యూహాల్లోనూ మార్పు అవసరమన్నారు. ఈ సదస్సు దేశంలోని సమస్యలను చర్చిచేందుకు, ఆత్మశోధన అర్థవంతంగా కొనసాగేందుకు ఓ గొప్ప అవకాశంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సదస్సుకు సోనియా, రాహుల్, ప్రియాంక సహా దాదాపు 400 ప్రతినిధులు హాజరయ్యారు.