Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ సర్కార్‌పై కాశ్మీరీ పండిట్ల ధ్వజం
- జమ్మూ కాశ్మీర్లో వెల్లువెత్తుతున్న నిరసనలు
- శ్రీనగర్‌లో ప్రదర్శకులపై లాఠీచార్జీ
శ్రీనగర్ : గురువారం సాయంత్రం కాశ్మీరీ పండిట్ హత్య జరిగిన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తమ భద్రతకు భరోసా ఎక్కడ వుందని ఆందోళనకారులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. శ్రీనగర్ విమానాశ్రయం దిశగా వెళ్ళేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులపై పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. వారిపై లాఠీచార్జీ కూడా చేశారు. చాలాచోట్ల కాశ్మీరీ పండిట్లు వారి వారి తాత్కాలిక శిబిరాల నుండి బయటకు వచ్చి రోడ్లను దిగ్భంధించారు. బిజెపి ప్రభుత్వానికి, మోడీ, అమిత్ షా, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాలకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. కాశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో నాలుగు వేల మందికి పైగా కాశ్మీరీ పండిట్లు తాత్కాలికంగా శిబిరాలు వేసుకుని జీవిస్తున్నారు. 2010లో ప్రత్యేక ఉపాధి ప్యాకేజీ కింద వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. పలు చోట్ల కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించారు. ''ఈ సిగ్గుచేటైన సంఘటనను మేం ఖండిస్తున్నాం. ఇదేనా పునరావాసమంటే ? అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మమ్మల్ని చంపడానికే ఇక్కడకు తీసుకువచ్చారా? ఇక్కడ భద్రత ఏది?'' అని ఆందోళనలకు దిగిన రంజన్ జుత్షి ప్రశ్నించారు. ''మేం పని చేసుకోవడానికే వచ్చాం. అంతకుమించి మాకు ఇక్కడ వేరే పని లేదు. మమ్మల్ని ఎందుకు కాల్చి చంపుతున్నారు.? మా నేరమేంటో చెప్పండి. ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.'' అని మరో ఆందోళనకారుడు ప్రశ్నించారు. అధికారులు ఎన్ని హామీలు ఇచ్చినా, మాపై దాడులు కొనసాగుతునే వున్నాయని సంజయ్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ పరిస్థితి ఎంత దుర్భరంగా వుందోచూడండి, తహసిల్దారు కార్యాలయంలో భద్రత వుంటుందని ఆశిస్తాం. కానీ తన టేబుల్ దగ్గర కూర్చుని పని చేసుకుంటున్న రాహుల్ భట్ శరీరంలోకి తూటాలు అత్యంత సమీపం నుండి దిగబడ్డాయని చెప్పారు. మొత్తంగా వ్యవస్థే కుప్పకూలింది. భద్రతే లేకుండా పోయిందని అన్నారు. బుద్గామ్‌లోని షేక్పొరా వద్ద జరుగుతున్న ఆందోళనల్లో స్థానిక ముస్లింలు కూడా చేతులు కలిపారు. ఆందోళనకారులకు మంచినీరు అందచేశారు. కాశ్మీరీ పండిట్లకు భద్రత, న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. మేజిస్ట్రేట్ కార్యాలయంలోనే హత్య జరిగితే ఇక కాశ్మీరీ పండిట్లు ఎక్కడకు పోతారని జావేద్ ఇక్బాల్ ప్రశ్నించారు. తాను బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వీల్లేకుండా తనను గృహ నిర్బంధంలో వుంచారని పిడిపి అధ్యక్షుడు మెహబూబా ముఫ్తి వ్యాఖ్యానించారు. ఆందోళనకారులను ఉక్కుపాదంతో అణచివేయడానికి చర్యలు తీసుకోవడం సిగ్గుచేటని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా విమర్శించారు.