Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వామపక్షాల పిలుపు
- ధరల పెరుగుదలతో ప్రజలపై భారం ొ మునుపెన్నడూ లేనంత నిరుద్యోగం
న్యూఢిల్లీ : ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న ధరలు, నిరుద్యోగ సమస్యపై దేశవ్యాప్త నిరసనలకు వామపక్షాలు పిలుపునిచ్చాయి. ధరల పెరుగుదల, నిరుద్యోగానికి వ్యతిరేకంగా మే 25-31 మధ్య దేశవ్యాప్తంగా ఐక్య, సంఘటిత పోరాటాలను చేయాలని వామపక్షపార్టీలు తమ శాఖలను కోరాయి. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ జనరల్ సెక్రెటరీ డెబబ్రాత బిశ్వాస్, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ జనరల్ సెక్రెటరీ మనోజ్ భట్టాచార్య, సీపీఐ(ఎం-ఎల్)-లిబరేషన్ జనరల్ సెక్రెటరీ దీపాంకర్ భట్టాచార్యలు ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
నిత్యావసరాల ధరల పెరుగుదల ప్రజలపై మునుపెన్నడూ లేని విధంగా భారాలు మోపుతోంది. కోట్లాది మంది ఆకలి బాధలతో తీవ్ర పేదరికంలోకి వెళ్లారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతున్న నిరుద్యోగ స్థాయి పైకి రావడం ప్రజల కష్టాలను మరింత పెంచుతున్నదని పేర్కొన్నారు. గతేడాది కాలంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు 70శాతం, కూరగాయల ధరలు 20శాతం, వంట నూనెలు 23శాతం, తృణధాన్యాలు ఎనిమిది శాతం పెరిగాయి. కోట్లాది మంది భారతీయుల ప్రధాన ఆహారమైన గోధుమలు ధర 14 శాతానికి పైగా పెరగడంతో గిట్టుబాటు కావడం లేదు. గోధుమల సేకరణ తగ్గింది. గతేడాదితో పోలిస్తే కేంద్రం సగానికి పైగానే సేకరించింది. ఈ ఏడాది సేకరణ లక్ష్యం 44.4 మెట్రిక్ టన్నులకు గానూ 20 మెట్రిక్ టన్నులు దాటలేదు. పెట్రోలియం ఉత్పత్తులు, వంట గ్యాస్ సిలిండర్ల ధరలు నిరంతరం పెరగటం, గోధుమల కొరత ఈ మొత్తం ద్రవ్యోల్బణాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. బొగ్గు కొరత విద్యుత్ ఖర్చును పెంచుతున్నదని తెలిపారు.
ఈ పరిస్థితుల్లో కేంద్రం తక్షణమే అన్ని పెట్రోలియం ఉత్పత్తులపై సెస్, సర్‌చార్జీలను ఉపసంహరించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ధరల పెంపును ముఖ్యంగా వంటగ్యాస్ సిలిండర్లను ఉపసంహరించుకోవాలని కోరారు. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా గోధుమ సరఫరాను పునరుద్ధరించాలనీ, ఈ ధరల పెరుగుదలను అరికట్టాలంటే పీడీఎస్‌ను పటిష్టం చేయాలని పేర్కొన్నారు.
వామపక్షాల డిమాండ్ :
- పెట్రోలియం ఉత్పత్తులపై సర్‌ఛార్జ్‌లు, సెస్‌లను వెనక్కి తీసుకోవాలి
- ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా గోధుమ సరఫరాలను పునరుద్ధరించాలి
- అన్ని అవసరమైన వస్తువులను ముఖ్యంగా పప్పులు, వంట నూనెలను పంపిణీ చేయడం ద్వారా పీడీఎస్ని బలోపేతం చేయాలి
- ఆదాయపు పన్ను చెల్లించని కుటుంబాలందరికీ ప్రత్యక్ష నగదు బదిలీని నెలకు రూ. 7,500కు పెంచాలి
- ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కేటాయింపును పెంచాలి. నిరుద్యోగ భృతి కోసం కేంద్ర పథకాన్ని చట్టబద్ధం చేయాలి
- పట్టణ ప్రాంతాలకు ఉపాధి హామీ పథకాన్ని చట్టబద్ధం చేయాలి
- అన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి.