Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సరళీకరణ విధానాలను విడనాడం
- 'నవ సంకల్ప్ చింతన్ శిబిర్' వద్ద మీడియాతో చిదంబరం
ఉదయ్ పుర్ : మూడు దశాబ్దాల నయా ఉదారవాద ఆర్థిక విధానాలను సరిచేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిఖ శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పి చిదంబరం అన్నారు. రాజస్థాన్‌లోని ఉదరుపుర్లో జరుగుతున్న కాంగ్రెస్ 'నవ సంకల్ప్ చింతన్ శిబిర్'లో ఆయన శనివారం ప్రసంగించారు. ఆర్థిక అంశాలకు సంబంధించిన కాంగ్రెస్ సంస్థాగత కమిటీకి ఆయన కన్వీనర్‌గా ఉన్నారు. ప్రపంచ, దేశీయ పరిణామాలను పరిగణలోకి తీసుకొని ఆర్థిక విధానాలను పునరువ్యవస్థీకరించాలని చిదంబరం సూచించారు. ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో బిజెపి ఘోరంగా విఫలమైందని, అయితే ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తాము కూడా విఫలమయ్యామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1991లో సరళీకరణ యుగానికి నాంది పలికిందని, సంపద, కొత్త వ్యాపారాల సృష్టిలో ఈ సంస్కరణలు దోహదం చేశాయని ఆయన చెబుతూనే 30 ఏళ్ల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయన్నారు. ప్రపంచ, దేశీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటే నాటి సరళీకరణ విధానాలను సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అసమానతలు పెరిగిపోవడం, అట్టడుగున ఉన్న పది శాతం పేదలు మరింత తీవ్రమైన పేదరికంలోకి కుగింపోతుండటం, 116 దేశాల ప్రపంచ ఆహార సూచీ-2021లో భారత ర్యాంకు 101కి చేరడం, మహిళలు, చిన్నారులలో పోషకాహార లేమి తీవ్రమౌతుండటం వంటి సమస్యలను పరిష్కరించేందుకు ఆర్థిక విధానాల్లో మార్పులు అవసరమన్నారు. అయితే నయా ఉదారవాద విధానాలను విడనాడాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందా? అన్న ప్రశ్నకు చిదంబరం సమాధానమిస్తూ 'మేము వెనకడుగు వేయాలని అనుకోవడం లేదు' అని అన్నారు. ఉదారవాద విధానాలను తగు మార్పులతో ముందుకు తీసుకెళ్లేందుకే పార్టీ కట్టుబడి ఉందని మాజీ కేంద్ర మంత్రి అన్నారు. దేశంలో నేడు ఇంధన ధరలు ఆకాశాన్నంటడానికి, నిరుద్యోగం భయానక స్థాయికి పెరిగిపోవడానికి, ఒకవైపు పేదరికంలో ప్రజలు కొట్టుమిట్టాడుతుంటే మరో వైపు కొద్ది మంది కుబేరుల చేతుల్లో దేశ సంపద పెద్దయెత్తున పోగుపడుతుండడానికి, సహజవనరులను ఉచితంగా, లేదా కారు చౌకగా దేశీయ బడా పెట్టుబడిదారులు, విదేశీ పెట్టుబడిదారుల పరం కావడానికి ఈ నయా ఉదార వాద విధానాలే కారణమని ప్రముఖ ఆర్థిక వేత్త ప్రభాత్ పట్నాయక్ వంటివారు పేర్కొంటున్నారు. ముప్పయ్యేళ్ల ఈ ఆర్థిక సంస్కరణలు దేశంలో నాలుగు లక్షల మందికిపైగా రైతుల ఆత్మహత్యలకు కారణమయ్యాయని నిపుణులు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఈ నయా ఉదారవాద విధానాలనే బిజెపి మరింత దూకుడుగా అమలు చేస్తోంది. కాంగ్రెస్ ఇప్పటికీ తాను అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ విధానాలనే కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో చిదంబరం చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో నెలకొన్న గందరగోళాన్ని తెలియజేస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.
నవంబరు 14 నుంచి ప్రజాందోళనలు
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను, వినాశకర విధానాలను ఎండగడుతూ పెద్ద ఎత్తున ఆందోళనలను చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. జన జాగరణ్ అభియాన్ పేరుతో నవంబరు 14 నుంచి 29 వరకు ప్రజల చెంతకు వెళ్లి ద్రవ్యోల్బణం వంటి సమస్యల గురించి వివరిస్తామని తెలిపింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, 'జన జాగరణ్ ఆందోళన్' తదుపరి దశకు కార్యచరణ రూపొందించాలని కోరారు. సోనియా అధ్యక్షతన జరుగుతున్న 'నవ సంకల్ప్ చింతన్ శిబిర్'లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) ప్రధానకార్యదర్శులు, ప్రదేశ్ (రాష్ట్ర) కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షులు, శాసనసభా పక్ష నాయకులు పాల్గొన్నారు. మూడు రోజుల చింతన్ శిబిర్ ఆదివారంతో ముగియనుంది.