Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముఖ్యమంత్రి పదవికి విప్లవ్ దేవ్ రాజీనామా
- రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా దెబ్బతిన్నదని పార్టీ పెద్దలకు ఫిర్యాదు
- కొత్త సిఎంగా మాణిక్ సాహా
- ఎన్నికల నేపథ్యంలో బీజేపీ వ్యూహాలు
న్యూఢిల్లీ : త్రిపురలో అధికార బీజేపీలోని నాయకులు మధ్య ముఠా పోరు తారాస్థాయికి చేరింది. వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీలో అధిపత్యపోరు ముదిరిపోవడంతో అధిష్టానం రంగంలోకి దిగింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ముఖ్యమంత్రి పదవికి విప్లవ్ కుమార్ దేవ్ శనివారం నాడు రాజీనామా చేశారు. ఆయన స్థానంలో మాణిక్ సాహాకు బీజేపీ అధినాయకత్వం పట్టం కట్టింది. ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ న్యూఢిల్లీలో రెండు రోజుల పాటు పర్యటించి బీజేపీ చీఫ్ జెపి నడ్దా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. అక్కడి నుంచి త్రిపురకు తిరిగి వచ్చిన వెంటనే తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ముఠా కుమ్ములాటల నేపథ్యంలోనే ఆయనను తప్పుకోవాల్సిందిగా అధిష్టానం ఆదేశించింది. ఏడాది కాలంగా ఈ కుమ్ములాటలు కొనసాగుతునే వున్నాయి. గతేడాది సిట్టింగ్ ఎంఎల్ఎ సుదీప్ రారు బర్మన్, పార్టీ అధిష్టానాన్ని కలిసి రాష్ట్ర పరిస్థితులపై ఫిర్యాదు చేశారు. అయితే అప్పట్లో మార్పుచేర్పులకు బీజేపీ అధినాయకత్వం సిద్ధపడలేదు. ప్రస్తుతం ఎన్నికలు తరముకొస్తున్న నేపథ్యంలో నాయకత్వ మార్పు అనివార్యమై విప్లవ్ను తప్పించినట్లు తెలుస్తోంది. ఇదే ఏడాది ఫిబ్రవరిలో ఇద్దరు సిట్టింగ్ ఎంఎల్ఎలు సుదీప్ రారు బర్మన్, అశీష్ షాలు వారి శాసనసభా స్థానాలకు, పార్టీ సభ్వత్వానికి రాజీనామా చేయడం, ఇద్దరు ఎంఎల్ఎలు పార్టీని వీడి కాంగ్రెస్లో చేరడంతో పరిస్థితి అదుపు తప్పినట్లు అధిష్టానం భావించింది. అసమ్మతి నేతలు ఢిల్లీ నాయకులతో, కేంద్ర మంత్రివర్గంలో త్రిపురకి చెందిన ఏకైక మంత్రి ప్రతిమా భౌమిక్తో క్రమం తప్పకుండా చర్చలు జరుపుతునే వున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రిని ఢిల్లీకి రావాల్సిందిగా పార్టీ అధిష్టానం ఆదేశించడం, ఆయన రాజీనామా చేయడం వెంటవెంటనే జరిగిపోయాయి. మరోవైపు విప్లవ్ స్థానంలో త్రిపుర కొత్త ముఖ్యమంత్రిగా డాక్టర్ మాణిక్ సాహాను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. సాహా సాహా ప్రస్తుతం త్రిపుర రాష్ట్ర బీజేపీ చీఫ్గా వున్నారు.