Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశీయంగా ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదలతో కేంద్రం నిర్ణయం!
న్యూఢిల్లీ : ప్రధాన ఆహార పంటల్లో ఒకటైన గోధుమల ఎగుమతిని నిషేధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ఉల్లి విత్తనాల ఎగుమతిపైనా నిషేధం విధించింది. దేశీయంగా గోధమ సహా అనేక నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రబీ సాగులో గోధుమ పంట మార్కెట్ యార్డులకు రాగా, కనీస మద్దతు ధర కన్నా అత్యంత దిగువన కొనుగోలు చేస్తున్న ప్రయివేటు ట్రేడర్స్, వ్యాపారులు..వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తూ లాభాలు పోగేసుకుంటున్నారు. దీనిపై కేంద్రం తీరు విమర్శలకు దారితీసింది. దాంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన కేంద్రం, తాజాగా ఎగుమతుల్ని అడ్డుకోవాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి రెండు రోజుల క్రితం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) నోటిఫికషన్ జారీచేసింది.
గోధుమల ఎగుమతిపై విధించిన నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని, ఆహార భద్రత విషయంలో ఇతర దేశాల విన్నపాలపై కేంద్రం ఇచ్చే అనుమతితో గోధుమ ఎగుమతికి అనుమతి ఇస్తామని డీజీఎఫ్టీ పేర్కొన్నది. అలాగే ఉల్లి విత్తనాల ఎగుమతిపై నిషేధిస్తూ ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలో మునుపెన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం పెరగటం, ఇంధనం, ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకుల ధరలు రికార్డ్స్థాయికి చేరుకున్నాయి. దీనికి సంబంధించి తాజా గణాంకాలు కేంద్ర ప్రభుత్వానికి చేరినందువల్లే మోడీ సర్కార్ ఎగుమతులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుందని నిపుణులు భావిస్తున్నారు.