Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని ఓ కమిర్షియల్ కాంప్లెక్స్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 27 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రకటించారు. గాయపడినవారికి రూ.50 వేలు చొప్పున అందజేయనున్నట్టు వెల్లడించారు.
నిందితులను విడిచిపెట్టబోం : సీఎం అరవింద్ కేజ్రీవాల్
సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముండ్కాలో అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశాన్ని శనివారం ఉదయం పరిశీలించారు.ఘటనపై విచారం వ్యక్తంచేశారు.ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం మెజిస్టీ రియల్ విచారణకు ఆదేశించిందనీ, నిందితులను విడిచిపెట్టబోమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు.. గాయపడ్డవారికి రూ.50 వేల పరిహారం : ప్రధాని కార్యాలయం ట్వీట్
అగ్నిప్రమాదంలో మృతి చెందినవారికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్‌గాంధీతో సహా పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం, గాయపడిన వారికి రూ.50,000 ఇవ్వనున్నట్టు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది.
పరారీలో భవన యజమాని..
అగ్నిప్రమాదం సంభవించిన కంపెనీ యజ మానులు హరీష్ గోయెల్, వరుణ్ గోయెల్లను పోలీసులు అరెస్టు చేశారు. అయితే మరణించిన వారిలో వారి తండ్రి అమర్నాథ్ గోయెల్ కూడా ఉన్నారు.ఆ కాంప్లెక్స్‌లో అగ్నిమాపక శాఖ నుంచి సేఫ్టీ క్లియరన్స్ లేని భవనం మనీష్ లక్రాదిగా పోలీసులు గుర్తించారు. ఆ భవన యజమాని పరారీలో ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు.
ఒక్కవైపే మెట్లు.. అందుకే తప్పించుకోలేకపోయారు : అగ్నిమాపక శాఖ డివిజనల్ అధికారి
కాంపెక్స్‌లోని రెండవ భవనంలో ప్రమాదం జరిగిన సమయంలో ప్రేరణాత్మక ప్రసంగ కార్యక్రమం జరుగుతున్నదని, ఈ కార్యక్రమానికి ఎక్కువమంది హాజరయ్యారని అందుకే ఈ భవనంలోనే అత్యధిక మరణాలు సంభవించాయ ని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ భవనంలో ఒకవైపు మాత్రమే మెట్లు ఉండటంతో ప్రజలు భవనం నుంచి తప్పించుకోలేకపోయారని అగ్నిమాపక శాఖ డివిజనల్ అధికారి తెలిపారు.
- కంపెనీకి చెందిన ఇద్దరి ఓనర్ల అరెస్టు
- పరారీలో భవన యజమాని
దేశ రాజధాని ఢిల్లీలోని ముండ్కాలో గల వాణిజ్య భవన సముదాయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన ఇద్దరు మంటలు చెలరేగిన మూడొంతస్థుల ఆఫీస్ కాంప్లెక్స్ కంపెనీ యజమానులు కావటం గమనార్హం. కాగా, చనిపోయినవారిలో ఏడుగురిని తానియా భూషన్, మోహిని పాల్, యశోదా దేవి, రంజు దేవీ, విశాల్, దృష్టి, కైలాశ్ జ్యాని లుగా గుర్తించారు. గాయాలపాలైనవారు సంజరు గాంధీ మెమోరియల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు ఆస్పత్రి క్షతగాత్రుల కుటుంబీకులు, బంధువుల కోసం ఒక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసింది. కంపెనీ ఓనర్లు హరీశ్ గోయెల్, వరుణ్ గోయెల్ లపై ఐపీసీలోని సెక్షన్లు 304, 308, 120, 34 ల కింద కేసులు నమోదయ్యాయి. కాగా, ఈ భవనసముదాయానికి ఫైర్ క్లియరెన్స్‌లు లేవని ఔటర్ డిస్ట్రిక్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సమీర్ శర్మ తెలిపారు. కాగా, భవన యజమాని మనీశ్ లక్రా పరారీలో ఉన్నారని చెప్పారు. మనీశ్ లక్రా కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయనీ, త్వరలో పట్టుకుంటామని తెలిపారు. కాగా, మృతుల సంఖ్య 30కి పెరగొచ్చని ఢిల్లీ ఫైర్ సర్వీసు డైరెక్టర్ అతుల్ గార్గ్ అన్నారు. మృతదేహాలను గుర్తించడానికి ఫోరెన్సిక్ ల్యాబ్ సహాయం తీసుకుంటామని సమీర్ శర్మ అన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ను నమోదు చేసినట్టు చెప్పారు.