Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైతుల విషయం వచ్చేసరికి అన్ని చట్టాలు వచ్చేస్తాయి
- రైతుల వెంట పడటంకాదు...
- దోచుకొనే పెద్ద చేపలను పట్టుకోండి
- రైతుపై బ్యాంకు కేసును తిరస్కరించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : బ్యాంకులు రూ. వేల కోట్లు ఎగ్గొట్టేవారిపై కాకుండా రైతులపై కేసులు పెడుతుండటాన్ని అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. ఈ విధంగా రైతులను న్యాయస్థానాలకు లాగితే వారి కుటుంబాలు ఆర్థికంగా నాశనమవుతాయని తెలిపింది. రూ. వేల కోట్లను దోచుకొనే పెద్ద చేపలను వెంటాడాలని హితవు పలికింది. ఓ రైతుకు సంబంధించిన కేసులో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో రుణం పొందిన రైతు మోహన్‌లాల్ పాటిదార్ వన్ టైమ్ సెటిల్మెంట్ చేస్తానని బ్యాంకుకు చెప్పారు. రూ.36,50,000 చెల్లించవలసి ఉందని లెక్కగట్టారు. ఆయన ముందుగా రూ.35,00,000 చెల్లించారు. బ్యాంకు ఆ సొమ్మును స్వీకరించింది. అయితే ఈ బ్యాంకుకు చెందిన అసెట్ రికవరీ బ్రాంచ్ స్పందిస్తూ, పూర్తి తుది పరిష్కారంగా రూ.50.50 లక్షలు చెల్లించవలసి ఉంటుందని ఆ రైతుకు నోటీసు పంపింది. దీంతో ఆ రైతు మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు.
ఆ రైతు తరపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపిస్తూ 2021 మార్చి 9నాటి లేఖను బట్టి తన క్లయింట్ వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) సొమ్ములో కనీసం 10శాతం సొమ్మును నిర్ణీత కాలంలో చెల్లించవలసి ఉందనీ, అయితే తన క్లయింట్ నిర్ణీత గడువులోగా రూ.36,50,000లలో రూ.35,00,000 చెల్లించారని చెప్పారు. 'ఇంటిమేషన్ లెటర్'ను జారీ చేసిన తర్వాత అందుకు అనుగుణంగా వ్యవహరించడం తప్ప బ్యాంకుకు మరొక అవకాశం ఏదీ లేదన్నారు. పిటిషనర్ అర్హుడైతే 'శాంక్షన్ లెటర్'ను జారీ చేయాలన్నారు. దీనిని అంగీకరించడంలో బ్యాంకు విఫలమైందనీ, రాజీ కుదిరిన మొత్తాన్ని ఏకపక్షంగా రూ.50.50 లక్షలకు పెంచిందని ఆరోపించారు. ఈ విధంగా చేయడం వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్‌కు విరుద్ధమని తెలిపారు.
ఈ విషయమై రైతు హైకోర్టును ఆశ్రయించగా.. 2022 ఫిబ్రవరి 21న కోర్టు తీర్పు ఇచ్చింది. బ్యాంకు ఆదేశాలను రద్దుచేసింది. బ్యాంకు చర్యలు, ఆదేశాలను ఆమోదించలేమని జస్టిస్ సుజోరు పాల్, జస్టిస్ ద్వారకాధీశ్ బన్సల్ ధర్మాసనం తెలిపింది. పిటిషన్లు సమర్పించిన ఓటీఎస్ ప్రతిపాదనను బ్యాంకు ఆమోదించి, వెంటనే శాంక్షన్ లెటర్స్‌ను జారీ చేయాలని ఆదేశించింది. మిగతా లాంఛనాలను బ్యాంకు పూర్తి చేయాలనీ, దాని ఫలితంగా పిటిషనర్లకు లభించే అన్ని అనుబంధ ప్రయోజనాలను వారికి కల్పించాలని స్పష్టంచేసింది.
దీనిపై బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారించి తీర్పుఇచ్చింది. మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. పెద్ద చేపలను వెంటాడాలనీ, ఇలాంటి వ్యాజ్యాల వల్ల రైతుల కుటుంబాలు ఆర్థికంగా నాశనమైపోతాయని ధర్మాసనం పేర్కొంది. ''రూ.1,000 కోట్లు దోచుకున్న వారిపై మీరు కేసులు పెట్టరు. కానీ రైతుల విషయం వచ్చేసరికి అన్ని చట్టాలు వచ్చేస్తాయి. మీరు డౌన్ పేమెంట్‌ను కూడా అంగీకరించారు'' అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అప్పీలును తోసిపుచ్చింది.