Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్పందించిన జీ7 దేశాలు
- గోధుమ ఎగుమతులను నిషేధించటంపై ఖండన
న్యూఢిల్లీ : దేశంలో ధరలు పెరగటం, పంట ఉత్పత్తి పడిపోవటంతో గోధుమ ఎగుమతులపై భారత్ నిషేధించడంపై జీ7 దేశాలు స్పందించాయి. భారత్ చర్యను ఖండించాయి. ఈ మేరకు ఆయా దేశాల వ్యవసాయ మంత్రిత్వ శాఖలు ఆందోళన వ్యక్తం చేశాయి. ''ప్రతి ఒక్కరూ ఎగుమతులపై ఆంక్షలు విధిస్తే, మార్కెట్లను క్లోజ్ చేస్తే.. అది సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తుంది'' అని జర్మనీ వ్యవసాయ మంత్రి సెమ్ ఒజ్దెర్మిర్ అన్నారు. జీ20 సభ్యదేశంగా భారత్ తన బాధ్యతను స్వీకరించాలని తాము కోరుతున్నట్టు చెప్పారు. దేశంలో పెరుగుతున్న ధరల నేపథ్యంలో గోధుమ ఎగుమతులపై నిషేధాన్ని విధిస్తూ కేంద్రం శుక్రవారం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కాగా, ప్రపంచవ్యాప్తంగా గోధుమ ఉత్పత్తిలో 13.53 శాతంతో రష్యా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉన్నది. రష్యా-ఉక్రెయిన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గోధుమ ఎగుమతులుకు భారత్ కేంద్రంగా మారింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో డిమాండ్ పెరిగింది. తీవ్ర వేడిగాలుల ప్రభావంతో భారత్‌లో గోధుమ ఉత్పత్తి తగ్గిపోయింది. కాగా, జూన్‌లో జర్మనీలో జరగబోయే జీ7 సమావేశంలో దీని గురించే లేవనెత్తుతామని జీ7 దేశాల వ్యవసాయ మంత్రులు తెలిపారు. ఈ సమావేశానికి హాజరు కావాలని ప్రధాని మోడీకి కూడా ఆహ్వానం అందింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఏర్పడిన ప్రపంచ ఆహార భద్రత, న్యూట్రిషన్‌కు సంబంధించిన తీవ్ర పరిణామాలతో తాము ఇబ్బందులకు గురయ్యామని మంత్రులు చెప్పారు. జీ7 కూటమిలో ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, జపాన్, ఇటలీ, కెనడాలు సభ్యదేశాలుగా ఉన్న విషయం తెలిసిందే...