Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో యూనివర్సిటీ ప్రొఫెసర్‌పై ఏబీవీపీ కార్యకర్తలు దాడి
- పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోనివైనం !
- ఏబీవీపీ ఇచ్చిన ఫిర్యాదుతో ప్రొఫెసర్పైన్నే కేసు
న్యూఢిల్లీ : తనపై ఏబీవీపీ కార్యకర్తలు దాడి చేశారని లక్నో యూనివర్సిటీలో ఓ దళిత ప్రొఫెసర్ పోలీసుల్ని ఆశ్రయించగా, అతడి నుంచి ఫిర్యాదు స్వీకరించడానికి స్థానిక పోలీసులు నిరాకరించారు. దాంతో ఆయన వారణాసిలో పోలీస్ ఉన్నతాధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. తన ఫిర్యాదును పట్టించుకోవటం లేదని, మరోవైపు యూనివర్సిటీలో ఏబీవీపీ వేధింపులు శ్రుతిమించిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారణాసిలోని 'జ్ఞాన్వాపీ మసీదు'కు సంబంధించి లక్నో యూనివర్సిటీ ప్రొఫెసర్ రవికాంత్ చందన్ ఓ వార్తా ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో వ్యాఖ్యలపై ఏబీవీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్ర పుస్తకాల్లోని విషయాల్నే తాను ప్రస్తావించానని చెప్పినా వినిపించుకోకుండా ఆయనపై గత మంగళవారం దాడికి తెగబడ్డారు. వర్సిటీ ఆవరణలో ఎక్కడ కనపడితే..అక్కడ తీవ్రంగా దూషిస్తున్నారు.
దాంతో ప్రొఫెసర్ చందన్ తనకు రక్షణ కల్పించాలని, తనపై దాడి చేసినవారిపై కేసు నమోదు చేయాలని హసన్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదు. తనకు, తన కుటుంబ సభ్యులకు ఏబీవీపీ నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. తమపై దాడి చేసిన, బెదిరింపులకు పాల్పడుతున్న ఏబీవీపీకి చెందిన 12మంది కార్యకర్తల పేర్లను అందులో తెలియజేశారు. ఇంతటి ఘోరమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న ఆయనకు పోలీస్ అధికారుల నుంచి వచ్చిన స్పందన షాక్‌కు గురిచేసింది. ఆయన చేసిన ఆరోపణలను ఫిర్యాదుగా తీసుకోకపోగా, ఏబీవీపీ కార్యకర్తల ఆరోపణల్ని పరిగణలోకి తీసుకొని ప్రొఫెసర్ చందన్పైన్నే పోలీసులు కేసు నమోదుచేశారు.
ఏబీవీపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు అమన్ దూబే ఇచ్చిన ఫిర్యాదుమేరకు ప్రొఫెసర్ చందన్‌పై హసన్‌గంజ్ పోలీసులు కేసు నమోదుచేశారు. ఎఫ్ఐఆర్ కూడా రిజిష్టర్ అయ్యింది. ఐపీసీలోని 153-ఏ, 504, 505..తదితర సెక్షన్ల కింద ఆరోపణలు నమోదుచేశారు. ఈ మొత్తం వ్యవహారంపై విసిగిపోయిన ప్రొఫెసర్ చందన్ చివరికి లక్నో పోలీస్ కమిషనర్ డి.కె.ఠాకూర్‌ను కలుసుకున్నారు. తన గోడు వెళ్లబోసుకున్నారు. వర్సిటీ ఆవరణలో తనపై దాడి జరిగిందని, దళిత సామాజిక వర్గానికి చెందిన తనపై ఏబీవీపీ కార్యకర్తలు దారుణమైన మాటలతో దూషించారని పోలీస్ కమిషనర్‌కు రాతపూర్వకంగా తెలియజేశారు. అయినప్పటికీ చందన్ నుంచి ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదు. రాష్ట్ర ప్రభుత్వం తన గొంతు నొక్కేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.