Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక కుటుంబం - ఒకే టిక్కెట్
- అక్టోబర్లో 'భారత్ జోడో యాత్ర'
- ముగిసిన కాంగ్రెస్ చింతన్ శిబిర్
ఉదయ్ పూర్ (రాజస్థాన్) : 50 ఏళ్లలోపు వారికి విస్తృత ప్రాతినిథ్యం కల్పించడంతోపాటు 'ఒకే వ్యక్తి, ఒకే పదవి', 'ఒక కుటుంబం, ఒకే టిక్కెట్' అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ మూడు రోజుల పాటు సాగిన కాంగ్రెస్ నవ్ సంకల్ప్ చింతన్ శివిర్ ఆదివారంతో ముగిసింది. ముగింపు రోజున ఈ మేరకు తీర్మానాలను ఆమోదించారు. అలాగే మూడు కొత్త విభాగాలను ఏర్పాటు చేయాలని పార్టీ నిర్ణయించింది. పబ్లిక్ ఇన్సైట్, ఎన్నికల నిర్వహణ జాతీయ శిక్షణ విభాగాలను ఏర్పాటు చేయనుంది. అలాగే కొత్తవారికి ప్రాతినిధ్యం కల్పించడం కోసం ఏ వ్యక్తి కూడా ఒకే పదవిలో దేళ్లకు మించి ఉండకూడదని కూడా పార్టీ నిర్ణయించింది. అదేవిధంగా పార్టీలో అన్ని స్థాయిల్లో 50 ఏళ్ల లోపు వారికి 50 శాతం ప్రాతినిధ్యం కల్పించాలని కూడా నిర్ణయించింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం ముగింపు ప్రసంగం ఇస్తూ సంస్థాగత సంస్కరణలు ప్రారంభించడానికి టాస్క్ఫోర్స్ను చేయనున్నట్లు ప్రకటించారు. రాజకీయ సవాళ్లపై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటి (సిడబ్యూసి)తో సభ్యులతో కలిపి సలహా బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 'భారత్ జోడో యాత్ర' పేరుతో కాంగ్రెస్ పాదయాత్ర ప్రారంభించన్నుట్లు ప్రకటించారు. పార్టీలో సీనియర్ల నుంచి జూనియర్ల వరకు అందరూ ఈ యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.అలాగే జన జాగరణ్ యాత్ర రెండో దశను జిల్లా స్థాయిల్లో జూన్ 15న ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ఈ సదస్సుకు సీనియర్ నేతలంతా హాజరుకావడంపై సోనియా సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ తిరిగి బలోపేతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. 'మళ్లీ పుంజుకుంటాం. ఇదే మా 'సంకల్పం' అని అన్నారు. కాంగ్రెస్ బలోపేతానికి ఈ సభ ఎంతగానో ఉపయోగ పడుతుందని, పార్టీ పుంజుకునేందుకు అందిన సిఫార్సులపై త్వరితగతిన చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు.