Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా రాజీవ్ కుమార్ ఆదివారం నాడిక్కడ నిర్వాచన్ సదన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకూ సీఈసీగా ఉన్న సుశీల్ చంద్ర పదవీ కాలం ముగియడంతో శనివారం నాడు పదవీ విరమణ చేశారు. ఆ స్థానంలో రాజీవ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. సీనియర్ మోస్ట్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను సీఈసీగా కేంద్రం ఈ నెల 12న నియమించింది. ఆయన నియామకం 15వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. రాబోయే లోక్‌సభ, రాష్ట్రపతి ఎన్నికలు, ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆయన ఆధ్వర్యంలోనే జరగనున్నాయి. ఆయన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సమయంలో కోవిడ్ ఆందోళనల మధ్య 2020లో బీహార్, అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. 2021 మార్చి-ఏప్రిల్‌లోనూ, ఇటీవలే 2022 ప్రారంభంలోనూ గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లకు ఎన్నికలు జరిగాయి.
సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజీవ్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగం అందించిన అత్యుత్తమ సంస్థల్లో ఒకటైన మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే సంస్థకు నాయకత్వం వహించే బాధ్యత తనకు లభించినందుకు గౌరవంగా భావిస్తున్నాననిఅన్నారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించటానికి, ఓటర్ల జాబితాల స్వచ్ఛతను నిర్ధారించడానికి, అవకతవకలను నిరోధించడానికి, మన ఎన్నికల నాణ్యతను పెంచడానికి ఈసీఐ గత డెబ్బై సంవత్సరాల్లో చాలా కృషి చేసిందన్నారు. 'కమీషన్ ప్రజాస్వామ్య పద్ధతులను అనుసరిస్తుంది. రాజ్యాంగం ప్రకారం బాధ్యత వహించే విషయాల్లో ఈసీఐ కఠినమైన నిర్ణయాలకు దూరంగా ఉండదు' అన్నారు. మెరుగైన ఎన్నికల నిర్వహణ, కార్యకలాపాల పారదర్శకత, ఓటరు సేవలను సులభతరం చేయడం కోసం సరళీకృతం చేయడానికి సాంకేతికతను మరింత ప్రధాన సాధనంగా మారుస్తామని రాజీవ్ కుమార్ అన్నారు.
కాగా, 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన రాజీవ్ కుమార్ 2020 సెప్టెంబర్ 1న ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. గత ఫిబ్రవరిలో ఆయన ఆర్థిక కార్యదర్శిగా రిటైర్ అయ్యారు. ప్రభుత్వంలో మూడు దశాబ్దాలకు పైగా సేవలందించిన ఆయన కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖలతో కలిసి పనిచేశారు. అప్పటి ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా స్థానంలో ఈసీగా కుమార్ పనిచేశారు.