Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆందోళనబాటలో యూపీలో ఎలక్ట్రానిక్ రిక్షా డ్రైవర్లు
- లక్నోలో ముఖ్యమైన రోడ్డుమార్గాల్లో ఈ-రిక్షాలపై నిషేధం
న్యూఢిల్లీ : లక్నో మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయం మూడు లక్షల మంది ఎలక్ట్రానిక్ రిక్షా డ్రైవర్ల జీవనోపాధికి ఎసరుతెచ్చింది. దాంతో లక్షలాది మంది డ్రైవర్లు ఆందోళనబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ట్రాఫిక్ పెరిగిపోయిందని, కాలుష్యం అరికట్టడం కోసమని ప్రధానమైన 11రోడ్డు మార్గాలపై ఎలక్ట్రానిక్ రిక్షాల రాకపోకల్ని ప్రభుత్వం నిషేధించింది. లక్నో మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్న ఈ హఠాత్తు నిర్ణయం తమ బతుకుల్ని ఆగం చేసిందని, జీవనోపాధి కోల్పోయి రోడ్డునపడతామని రిక్షా డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ''మా ఆందోళన ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సమస్యను పరిష్కరించకపోతే వెంటనే సమ్మెకు దిగుతాం. మాకు మరో మార్గం లేదు'' అని డ్రైవర్ల సంఘాలు హెచ్చరించాయి. నిషేధం అమల్లో ఉన్న రోడ్డు మార్గాల్లో ఈ-రిక్షాలు కనపడితే కఠిన చర్యలు తీసుకుంటామన్న పోలీసుల హెచ్చరికపై డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ-రిక్షాల్లో 80శాతం బ్యాంకు రుణాలతో కొనుగోలు చేయగా, మొన్నటివరకూ లాక్డౌన్, కరోనా పరిస్థితుల కారణంగా డ్రైవర్లు పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోయారు. ఇప్పుడు రోడ్డు మార్గాలపై నిషేధం విధించటం వల్ల రుణ వాయిదాలు చెల్లించలేకపోతున్నామని డ్రైవర్లు వాపోతున్నారు. ఎలక్ట్రానిక్ రిక్షా డ్రైవర్ నయీం అక్తర్ మాట్లాడుతూ..''రుణ వాయిదాలు చెల్లించలేదని మొన్నటివరకూ బ్యాంకు అధికారులు మమ్మల్ని ఎంతగానో వేధించారు. లాక్డౌన్ పోయింది. సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి..అని రాత్రిపగలు పనిచేస్తున్నాం. బ్యాంకు రుణాలు చెల్లించటం మాకు అత్యంత ముఖ్యమైన అంశం. ఇప్పుడు మళ్లీ కొత్తగా లక్నోలో అనేకమార్గాల్లో ఈ-రిక్షాల రాకపోకల్ని నిషేధించారు. ఇప్పుడు మేమంతా ఎక్కడికిపోవాలి'' అని ప్రశ్నిస్తున్నాడు. మరో డ్రైవర్ కమలేష్ మాట్లాడుతూ...''రిక్షా డ్రైవర్లపై ఏమాత్రం సానుభూతి ఉన్నా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోదు. కరోనా వల్ల ఇప్పటికే ఆదాయం కోల్పోయి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. మూడేండ్ల క్రితం రూ1.5లక్షలతో ఈ-రిక్షా కొనుగోలు చేశా. బ్యాంకు రుణం రూ.62వేలు చెల్లించాలి. పెద్దగా ఆదాయంలేని మార్గాల్లోకి వెళ్లితే ఎలా బతుకుతాం. రుణ వాయిదా ఎలా కడతాం. ఇంటికి డబ్బులు ఎలా పంపుతా''మని ఆయన అన్నాడు.