Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు సీపీఐ(ఎం) ఎంపీ వి.శివదాసన్ లేఖ
న్యూఢిల్లీ : ఇండియన్ రైల్వేలో రద్దుచేసిన పోస్టులను పునరుద్ధరించాలని సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపీ వి.శివదాసన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఎంపీ వి.శివదాసన్ లేఖ రాశారు. ఇండియన్ రైల్వేలో ఉద్యోగ ఔత్సాహికులు ఎదుర్కొంటున్న సంక్షోభం పట్ల శ్రద్ధ వహించాలని కోరారు.దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ సంస్థ ఇండియన్ రైల్వేలో గత ఆరేండ్లలో 72 వేల కంటే ఎక్కువ ఖాళీలను రద్దు చేసినట్టు ఇటీవల నివేదికలు వెల్లడిస్తున్నాయని తెలిపారు. వాటిలో చాలా వరకు గ్రూప్ సీ, డీ పోస్టులు ఉన్నాయనీ, 2015-16 నుంచి 2020-21 వరకు ఆర్థిక సంవత్సరాల్లో 16 జోనల్ రైల్వేలు 56,888 పోస్టులు సరెండర్ అయ్యాయని అన్నారు. మరో 15,495 మందిని సరెండర్ చేయాల్సి ఉందని తెలుస్తోందని తెలిపారు. ఉత్తర రైల్వే 9,000 కంటే ఎక్కువ పోస్టులను సరెండర్ చేయగా, సౌత్ ఈస్టర్న్ రైల్వే 4,677 పోస్టులను సరెండర్ అయ్యాయి. దక్షిణ రైల్వే 7,524 పోస్టులను, తూర్పు రైల్వే 5,700 కంటే ఎక్కువ పోస్టులను రద్దు అయ్యాయని తెలిపారు. అదే సమయంలో రైల్వేలో 2,65,547 ఖాళీలు ఉన్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొందని పేర్కొన్నారు.ఇటీవల దేశంలోని అనేక ప్రాంతాల్లో రైల్వే రిక్రూట్మెంట్లో జరిగిన విపరీతమైన జాప్యానికి వ్యతిరేకంగా వేలాది మంది యువకులు నిరసన తెలిపారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున పోస్టులను రద్దు చేయటమేంటని ప్రశ్నించారు. రైల్వేలో ఉద్యోగాలను ఆశించేవారి దుస్థితిని పరిగణనలోకి తీసుకోవాలనీ, రద్దు చేసిన ఖాళీలను పునరుద్ధరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీ వి.శివదాసన్ కోరారు.