Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రామన్ మెగసెసే అవార్డు గ్రహీత పి.సాయినాథ్
- ఇక విశాల ఐక్య సమర శీల ఉద్యమం
- ఆగస్టు 1న 500 గ్రామీణ జిల్లాల్లో ఆందోళనలు : వ్యవసాయ కార్మిక సంఘాల జాతీయ కన్వెన్షన్ పిలుపు
న్యూఢిల్లీ : దేశంలో అసమానతలు మరింతగా పెరిగాయని రామన్ మెగసెసే అవార్డు గ్రహీత,పీఏఆర్ఐ వ్యవస్థాపకులు పాలగుమ్మి సాయినాథ్ తెలిపారు. వ్యవసాయ కార్మికుల అఖిల భారత కన్వెన్షన్ సోమవారం నాడిక్కడ హరికిషన్ సింగ్ సుర్జీత్ భవన్ లో జరిగింది. ఈ కన్వెన్షన్ ను సాయినాథ్ ప్రారంభించారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఎఐఎడబ్ల్యుయు) జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ కార్యచరణ ప్రణాళికను ప్రవేశపెట్టగా, జాతీయ సహాయ కార్యదర్శి విక్రమ్ సింగ్ తీర్మానం ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా పి.సాయినాథ్ మాట్లాడుతూ దేశంలో 1920 నాటి తీవ్రమైన అసమానతలు, వందేండ్ల తరువాత మళ్ళీ పునరావృతమవుతున్నాయని అన్నారు. ఈ తీవ్రమైన అసమానతలకు అధికంగా ప్రభావానికి గురవుతున్న వారు వ్యవసాయ కార్మికులు, దళితులు, గిరిజనులు, మహిళలు అని వివరించారు. 30 ఏండ్లలో పెరగని శతకోటేశ్వరులు, కోవిడ్ విజృంభించిన ఆ రెండేండ్లలోనే పెరిగారని చెప్పారు. ఫార్మా రంగం, ఆన్లైన్ ఎడ్యుకేషన్ నిర్వహించిన వారు కోటీశ్వర్లు అయ్యారని తెలిపారు. నయా ఉదారవాద ఆర్థిక విధానాల ఫలితంగా మన సమాజంలో నెలకొన్న అసమానతలను సాయినాథ్ వివరించారు. 1991లో దేశంలో ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టినప్పుడు, దేశంలో ఒక్క డాలర్ బిలియనీర్ కూడా లేడని అన్నారు. కానీ ప్రస్తుతం ఫోర్బ్స్ నివేదిక ప్రకారం దేశంలో 166 డాలర్ల బిలియనీర్లు ఉన్నారని తెలిపారు. ఈ 166 మంది వ్యక్తుల మొత్తం ఆస్తులు 794 బిలియనీర్ డాలర్లని వివరించారు. సామాజిక ఆర్థిక కుల గణనను నిర్వహించిన 2012 సంవత్సరంలో ఈ సంఖ్య 53గా ఉందని తెలిపారు. ఈ జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ కుటుంబాల్లో మూడింట రెండు కుటుంబాలు రూ. 5,000 కంటే తక్కువ ఆదాయం కలిగి ఉన్నారని, 90 కుటుంబాల ఆదాయం రూ.10,000 కంటే తక్కువ ఉందని అన్నారు. మిగిలిన 10 శాతం మందిలో ఎక్కువ మంది కుటుంబాలు ఆ సమయంలో ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారని అన్నారు. కోవిడ్-19 కాలంలో కార్పొరేట్ సంస్థలు భారీ లాభాలు ఆర్జించేందుకు ప్రభుత్వ విధానాలు ఎలా దోహదపడ్డాయో ఆయన వివరించారు. రాజ్యాంగ పీఠికలో కూడా పొందుపరిచిన ఈ అసమానతలకు వ్యతిరేకంగా మనం స్వాతంత్య్ర పోరాటం చేశామని ప్రతినిధులకు గుర్తు చేశారు. వ్యవసాయ కార్మికుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని అన్నారు. పనులు లేక పట్టణాలకు వలస వెళ్లేందుకు సిద్ధపడుతున్నారని, అయితే ఇప్పుడు పట్టణాల్లో పనులు లేక, గ్రామాలకు వెళ్లిపోతున్నారని విమర్శించారు.
వ్యవసాయ కార్మికుల సమస్యలపై ఐక్యంగా..
అందరికీ ఉపాధి, ఇళ్లు, భూమి, ఆహారం, విద్యా, వైద్యం, సమానత్వం కోసం విశాల ఐక్య సమర శీల ఉద్యమాలకు ఐదు వ్యవసాయ కార్మిక సంఘాల ఉమ్మడి జాతీయ కన్వెన్షన్ పిలుపు ఇచ్చింది. వ్యవసాయ కార్మికుల సమస్యలపై ఉద్యమిస్తోన్న సంఘాలను, వ్యక్తులను సమీకరించాలని కన్వెన్షన్ తీర్మానించింది. తీర్మాణంపైన, ఆయా రాష్ట్రాల్లో సమస్యలపైన అన్ని రాష్ట్రాలకు చెందిన 118 మందికి పైగా ప్రతినిధులు చర్చల్లో మాట్లాడారు. తీర్మానానికి జిఎస్ గోరియా మద్దతు ఇచ్చారు. వివిధ రాష్ట్రాల నుంచి 500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. భవిష్యత్తు కార్యచరణకు జాతీయ కన్వెన్షన్ పిలుపు ఇచ్చింది. జూన్-జులైల్లో రాష్ట్రాల్లోనూ, జిల్లాల్లోనూ వ్యవసాయ కార్మిక సంఘాల ఉమ్మడి సదస్సులు నిర్వహించాలని కన్వెన్షన్ నిర్ణయించింది. జులై 15 నుంచి 30 వరకు 15 రోజుల పాటు గ్రామం, మండలం, జిల్లాస్థాయిల్లో ప్రచార ఉద్యమానికి (జాతాలు, ప్రదర్శనలు, సభలు, ర్యాలీలు, యాత్రలు) కన్వెన్షన్ నిర్ణయించింది. ఆగస్టు 1న దేశవ్యాప్తంగా 500 గ్రామీణ జిల్లాల్లో ఆందోళనలకు కన్వెన్షన్ పిలుపు ఇచ్చింది. మోడీ ప్రభుత్వం స్పందించకపోతే గ్రామీణ సమ్మెకు కన్వెన్షన్ హెచ్చరించింది. ఎఐఏడబ్ల్యూయూ నుంచి బి.వెంకట్, దుర్గా స్వామి, భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ నుంచి డి.ఎస్ కశ్యప్, దేవి రామ్, రాధాదేవి, ఆల్ ఇండియా అగ్రికల్చరల్ అండ్ రూరల్ లేబర్ అసోసియేషన్ నుంచి శ్రీ రామ్ చౌదరి, గౌరవ్ కుమార్ సంయుక్తంగా ఈ సదస్సుకు అధ్యక్షత వహించారు.