Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విదేశీ పాల ఉత్పత్తుల దిగుమతులతో ప్రమాదం
- : ఏఐకేఎస్ అధ్యక్షుడు అశోక్ ధావలే
న్యూఢిల్లీ : విదేశీ పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం వల్ల దేశీయ కోఆపరేటివ్ డెయిరీల ఉనికికి ముప్పు ఏర్పడుతుందని ఏఐకేఎస్ అధ్యక్షుడు అశోక్ ధావలే అన్నారు. కేరళలోని కోజికోడ్‌లో మొదటి ఆల్ ఇండియా డెయిరీ ఫార్మర్స్ వర్క్‌షాప్‌ను ధావలే ప్రారంభించారు. అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్), పి.సుందరయ్య మెమోరియల్ ట్రస్ట్ సంయుక్తంగా వర్క్ షాపును ఏర్పాటు చేసింది. ఏఐకేఎస్ సహాయ కార్యదర్శి విజూ కృష్ణన్ అధ్యక్షతన ప్రారంభోత్సవ సభ జరిగింది. ఈ సంధర్భంగా అశోక్ ధావలే మాట్లాడుతూ.. అనేక విదేశీ కంపెనీలు భారతీయ డెయిరీ కంపెనీలతో విలీనమై నేడు మార్కెట్‌ను శాసిస్తున్నాయని అన్నారు. డెయిరీ కో-ఆపరేటివ్‌లు తమ ప్రభుత్వాల నుంచి భారీ సబ్సిడీని అనుభవిస్తున్న విదేశీ కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడలేవన్నారు. సామ్రాజ్యవాద శక్తుల ఒత్తిడితో పాలు, పాల ఆధారిత ఉత్పత్తులపై స్వేచ్ఛా వాణిజ్యాన్ని అనుమతించడం వల్ల దేశీయ మార్కెట్‌ను తెరవాలనే ప్రణాళిక నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకోవాలని చూస్తుందని వివరించారు. అనేక రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలు గోహత్య సమస్యను వర్గీకరణ చేయడం వల్ల పశువుల వ్యాపారాన్ని నిషేధించాయని విమర్శించారు. తద్వారా రైతు కుటుంబాల ఆదాయంలో 27 శాతం అందించే పశు ఆదాయం కోల్పోతున్నాయని అన్నారు. ఈ తెలివి తక్కువ చర్య పాడి రైతులపై రెట్టింపు ప్రభావాన్ని చూపిందని, వారి పశువుల సంపద నుంచి ఆదాయాన్ని కోల్పోవడం జరుగుతుందని పేర్కొన్నారు.
లాభసాటి ధర ఇచ్చేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి..
పాల రైతులకు లాభసాటి ధర సరిగా నిర్ధారించి, ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ధావలే కోరారు. పశువుల సంతను నిషేధించే చట్టాలపై సవరణ చేయాలని డిమాండ్ చేశారు. పశు వాణిజ్య మార్కెట్‌ను తెరవాలని, పాడి రైతులకు మార్కెట్ రేటు చెల్లించాలని కోరారు. పాడి రైతులకు డెయిరీ సహకార సంఘాలు, ప్రయివేట్ కార్పొరేట్ డెయిరీల మధ్యవర్తుల ద్వారా లభించే ధరలో ఉత్పత్తి ఖర్చు కూడా రావడం లేదని పేర్కొన్నారు. లాక్డౌన్ సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో పాల ధర సగానికి తగ్గి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. అయితే పెద్ద డెయిరీ కార్పొరేట్, సహకార సంస్థలు ఆకర్షణీయమైన లాభాలను ఆర్జించాయని తెలిపారు. పారిశ్రామిక మిగులు విలువ ఆధారిత పాల ఉత్పత్తులను సహకార సంఘాలతో పాటు కార్పొరేట్ కంపెనీలు పాల ఉత్పత్తిదారులతో వారి నుంచి సేకరించిన పాల నిష్పత్తి ప్రకారం అదనపు ధరకు పంచుకునేలా కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలని వర్క్‌షాప్ డిమాండ్ చేసిందని తెలిపారు.
కేరళ నమూనాను అమలు చేయాలి
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సవరించి, పాడి పరిశ్రమను విస్తరించాలని డిమాండ్ చేశారు. కనీసం రెండు పాల పశువులు కలిగి ఉన్న రైతులందరికీ 100 రోజుల కూలీ, సహకార సంఘానికి పాలు ఇచ్చేలా చేయాలని అన్నారు. అయ్యంకాళి ఉరబన్ ఉపాధి హామీ పథకం (ఏయూఈజీఎస్) ద్వారా కేరళ ఎల్డీఎఫ్ ప్రభుత్వం అమలు చేసిన నమూనాతో ఇది సాధ్యమేనని స్పష్టం చేశారు. ఈ పథకం ప్రకారం పట్టణ ప్రాంతంలోని పాడి రైతులకు ఏడాదికి రూ.32,400 విడుదల చేస్తారని, దీనిని దేశవ్యాప్తంగా విస్తరింపజేయాలని డిమాండ్ చేశారు. దేశంలో డైరీ రంగంలోనూ, పాల ఉత్పత్తిలోనూ అద్భుతమైన అభివృద్ధిని తీసుకొస్తుందని, గ్రామీణ ప్రాంతంలోని ప్రజల జీవనోపాధి భద్రతను పెంచుతుందని అన్నారు.
కేరళ డెయిరీ కో-ఆపరేటివ్ లీటరుకు రూ. 38 ఇస్తుండగా, దేశంలోని ఇతర ప్రాంతాల్లోని పాడి రైతులు ఆవు పాలకు రూ.17 నుండి రూ.35 వరకు పొందుతున్నారని అన్నారు. పాల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో 83 శాతం పాల ఉత్పత్తిదారులకు కేటాయించడం వల్ల ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. మరోవైపు రైతులకు ఉత్పత్తి ఖర్చులు అందక నష్టాలు కూడా చవిచూడాల్సి వస్తోందని చెప్పారు.
కాగా ఆల్ ఇండియా డెయిరీ ఫార్మర్స్ ఫెడరేషన్ ఏర్పాటయింది. ఆర్ఎస్ఎస్-బీజేపీ మతతత్వ వైఖరిని వర్క్‌షాప్ తీవ్రంగా ఖండించింది. పశువుల వ్యాపార మార్కెట్లను వెంటనే తెరవాలనీ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పశువులకు మార్కెట్ ధర చెల్లించి వాటిని సేకరించి, వాటిని ఆవు ఆశ్రయాల్లో పెంచాలని డిమాండ్ చేసింది. ఈ వర్క్‌షాప్‌నకు వివిధ రాష్ట్రాల నుంచి 71 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వివిధ సెషన్లలో పి మోహనన్ మాస్టర్, పనోలి వల్సన్ మాట్లాడారు. డాక్టర్ సుధీర్ బాబు (కేరళ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్స్ యూనివర్సిటీ రిజిస్ట్రార్), డాక్టర్ దినేష్ అబ్రోల్ (ఇన్స్టిట్యూట్ ఫర్ స్టడీస్ ఇన్ ఇండిస్టియల్ డెవలప్మెంట్ ఫ్యాకల్టీ), విజయంబ ఆర్ (ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్), ఇందర్జిత్ సింగ్, డాక్టర్ అజిత్ నవాలే, రంజినీ బసు, నిధీష్ జానీ విల్లట్, పి కృష్ణప్రసాద్. కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్నాటక, త్రిపుర, మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, హర్యానా, గుజరాత్, అసోం, యూపీ, మణిపూర్ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు.
పి.కష్ణ ప్రసాద్, అజిత్ నవాలే, పద్మకుమార్, మహమ్మద్ అలీ సమన్వయకర్తలుగా, అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు,డెయిరీ కోఆపరేటివ్స్ ప్రతినిధులతో ఆర్గనైజింగ్ కమిటీని వర్క్‌షాప్ ఏర్పాటు చేసింది. ఆల్ ఇండియా డెయిరీ ఫార్మర్స్ ఫెడరేషన్ ఏర్పాటు పాడి సహకార సంఘాలను మెరుగుపరచడానికి, రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి కోసం ఈ రంగంలో పోరాటాలను ముందుకు తీసుకువెళుతుందని నేతలు తెలిపారు. తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రిత్వ శాఖకు సమర్పించాలనీ, నవంబర్ 26న వర్గీస్ కురియన్ జన్మదినాన్ని పురస్కరించుకుని పాడి రైతుల దినోత్సవంగా జరుపుకోవాలని వర్క్‌షాప్ నిర్ణయించిందని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి పాడి రైతుల సమస్యలపై నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.