Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేదిక పైకి రాళ్లు విసిరిన వైనం
- ఎంపీలోని రాజగర్ జిల్లాలో ఘటన
భోపాల్ : బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో దళితుల పట్ల అవమానాలు కొనసాగుతున్నాయి. వారి పట్ల పెత్తందార్లు వేధింపులు ఆగటం లేదు. రాజగర్ జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనే అక్కడి పరిస్థితిని తెలియజేస్తున్నది. తమ గ్రామం నుంచి ఊరేగింపు జరగొద్దని దళితుడి పెండ్లి వేడుకలో పెత్తందార్లు కొందరు రాళ్లు విసిరారు. దీంతో పెండ్లి ఊరేగింపు తంతును పోలీసుల బందోబస్తు మధ్య నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. పిప్లాయియ గ్రామంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నది. పెండ్లి ఊరేగింపుతో దళితుడు తమ గ్రామానికి రావడాన్ని జీర్ణించుకోలేని కొందరు పెత్తందార్లు ఈ దుశ్చర్యకు దిగారు. పెండ్లి జరిగే వేదిక పైకి రాళ్లు విసిరారు. అక్కడ నానా హంగామా సృష్టించారు. ఘటన గురించి సమాచారం అందటంతోనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావటానికి నిరసన చేస్తున్న వారిపై టియర్‌గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఎట్టకేలకు పోలీసుల బందోబస్తు నడుమ పెండ్లి కొడుకు ఉరేగింపు కొనసాగింది. అనంతరం పెండ్లి జరిగింది. ఈ ఘటనలో 40 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసును నమోదు చేసినట్టు జిరాపూర్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రభాత్ గౌర్ తెలిపారు. కాగా, పెత్తందార్ల దుశ్చర్యను దళిత సంఘాలు ఖండించాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.