Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో వివాదం
- 'జ్ఞానవాపి'లో కొంతభాగం సీజ్‌కు స్థానిక కోర్టు ఆదేశం
- సుప్రీంలో నేడు విచారణ
వారణాశి : అయోధ్య తరహాలోనే మరోమారు సంఘటనలు చోటుచేసుకోనున్నాయా? నాడు రాముడ్ని వాడుకుని దేశ ప్రజలను చీల్చిన సంఫ్‌ుపరివార్ శక్తులు ఇప్పుడు శివుడ్ని తమ రాజకీయ అవసరాలకోసం ముందుకు తెస్తున్నాయా? వారణాశిలోని జ్ఞానవాపి మసీదు కేంద్రంగా తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు అటువంటి ప్రశ్నలనే లేవనెత్తుతున్నాయి. కోర్టు ఆదేశాలతో కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న వీడియో సర్వేలో భాగంగా మసీదులోని బావిలో దొరికిన ఒక పొడుగాటి స్థంబాన్ని శివలింగంగా పేర్కొంటూ దాఖలైన పిటిషన్ ఆధారంగా ఆ ప్రాంతాన్ని సీజ్ చేయాలని వారణాశిలోని స్థానిక కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ సర్వేను నిలిపివేయాలంటూ జ్ఞానవాపి మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ నిర్వహించనుంది. ఇదే తరహాలో దాఖలైన మరో పిటిషన్‌పై విచారణను ఉత్తర ప్రదేశ్ హైకోర్టు 20వ తేదికి వాయిదా వేస్తూ సోమవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు కోర్టుల్లో విచారణ పెండింగ్‌లో ఉండగానే స్థానిక కోర్టు 'సీజ్' ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన పారామిలటరీ, స్థానిక అధికారయంత్రాంగం తీర్పు అమలుకు చర్యలు చేపట్టాయి. స్థానిక కోర్టు ఆదేశాలు వెలువడగానే 'అక్కడ దేవాలయం ఉందనడానికి అదే ఆధారం. దీనిని అందరూ ఆమోదించాలి.' అని స్పందించింది. ఉత్తరప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య 'శివ భక్తులకు ఈ వార్త ఎంతో సంతోషం ఇస్తుంది. కోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది.' అని చెప్పారు.
కొద్దిరోజల క్రితం కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలులో భాగంగా జ్ఞానవాపి మసీదులో వీడియో సర్వే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సర్వేలో భాగంగా మూడవ రోజు మసీదు వెనుక వైపు ఉన్న బావిలో పొడవాటి స్థంభాన్ని కనుగొన్నారు. దానినే శివలింగంగా పేర్కొంటూ ఆ స్థలానికి రక్షణ కల్పించాలని కోరుతూ హిందూ సంస్థల తరపున స్థానిక కోర్టులో సోమవారం ఉదయం పిటిషన్ దాఖలైంది. హిందూ సంస్థల తరపున పిటిషన్ దాఖలు చేసిన లాయర్లలో ఒకరైన దీపక్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ ' ముస్లింలు వుజు చేసుకునే ప్రాంతంలో జరిగిన సర్వేలో మాకు మూడు అడుగుల పొడవున్న రాయి లభించింది. వారు దానిని ఫౌంటైన్ అని చెబుతున్నారు. శుభ్రం చేసి చూసిన తరువాత మేం దానిని శివలింగంగా గుర్తించాం. వెంటనే ఈ ప్రాంతానికి రక్షణ కల్పించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించాం. కోర్టు సానుకూలంగా తీర్పు చెప్పింది' అని అన్నారు. మరోవైపు ఈ తీర్పును పై కోర్టులో సవాల్ చేయాలని మసీదు కమిటీ నిర్ణయించింది. కాశ్మీర్‌కు చెందిన పిడిపి చీఫ్ మెహబూబా ముఫ్తీ కోర్టు తీర్పు అనంతరం మాట్లాడుతూ ' ఎన్ని మసీదుల మీద మీరు కన్ను వేశారో చెప్పండి. ఇప్పుడు జ్ఞానవాపి మసీదు అంటున్నారు. ఇంకా మీ జాబితాలో ఎన్ని ఉన్నాయి.' అని సంఫ్‌ుపరివార్ శక్తులనుద్దేశించి ప్రశ్నించారు.