Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్
- ఎన్డీఆర్ఎఫ్ బృందాల మోహరింపు
తిరువనంతపురం : కేరళలో భారీ వర్షాలు మరింత ఉధృతం కానున్నాయి. భారత వాతవరణ సంస్థ (ఐఎండీ) ఇప్పటికే రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. తీవ్ర వర్షాల అంచనాల నేపథ్యంలో ఐదు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను వివిధ జిల్లాలో మోహరించారు. కేరళ రాష్ట్ర విపత్తు నియంత్రణ యంత్రాంగం (కేఎస్డీఎంఏ) అభ్యర్థన మేరకు ఇడుక్కి, ఎర్నాకుళం, మలప్పురం, కోజికోడ్, వయనాడ్ జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి. సహాయ చర్యలకు అవసరమైన పరికరాలతో అంతా సన్నద్ధంగా ఉన్నట్టు ఎన్డీఆర్ఎఫ్ వివరించింది. అరక్కోణంలోని కంట్రోల్ రూం నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడించింది. సోమవారం ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిస్సూర్, కోజికోడ్, కన్నూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. రాష్ట్రంలో కాసర్గోడ్ మినహా ఇతర జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ప్రజలు నదులకు దూరంగా ఉండాలనీ, చేపల వేటలకు వెళ్లకూడదని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర విపత్తు నిర్వహణ యంత్రాంగం (ఎస్డీఎంఏ) కోరింది. పర్వత ప్రాంతాలకు దూరంగా ఉండాలనీ, వర్షాలు తగ్గేవరకు రాత్రి ప్రయాణాలు చేయొద్దని ఎస్డీఎంఏ సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు లోతట్టు ప్రాంతాలకు, నదులు, పర్వత ప్రాంతాలకు దూరంగా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగాలు కోరాయి.