Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ విద్యామంత్రి ఆర్ బిందు
- 'రిజెక్ట్ ఎన్ఇ' పేరుతో ఏఐఎస్ఎఫ్ సదస్సు
- ఎన్ఈపీని వ్యతిరేకించిన తమిళనాడు, మహారాష్ట్ర మంత్రులు
చెన్నై : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానాన్ని (ఎన్ఈపీ) కేరళ ఉన్నతవిద్యాశాఖ మంత్రి ఆర్ బిందు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విద్యావిధానం అత్యధిక మంది విద్యకు దూరం కావడానికీ, భారీ డ్రాపౌట్లకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం చెన్నైలో 'రిజెక్ట్ ఎన్ఇ' పేరుతో అఖిల భారత విద్యార్థుల సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జాతీయస్థాయి సదస్సును నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేరళ మంత్రి ఆర్ బిందు మాట్లాడారు. ఈ విధానం అమలైతే సమాఖ్య వ్యవస్థకే విఘాతం కలుగుతుందని విమర్శించారు. ఎన్ఈపీతో విద్యార్థులకు వృత్తి శిక్షణ మాత్రమే లభిస్తుందనీ, విద్య కాదని తెలిపారు. అట్టడుగు వర్గానికి చెందిన విద్యార్థులు ఈ విధానంతో తీవ్రంగా ప్రభావితం అవుతారని చెప్పారు. 'కేంద్రం తీసుకుని వచ్చిన ఎన్ఈపీ సరైన విద్య లేకుండా వృతి శిక్షణ మాత్రమే ఇస్తుంది. విద్యార్థులు డిగ్రీ, డిప్లోమో సర్టిఫికేట్లతో మాత్రమే బయటకు వస్తారు. వారికి ఎప్పటికీ ఉద్యోగాలు రావు' అని చెప్పారు. మరోవైపు ఈ విద్యావిధానంతో ఉన్నత వర్గాలకు చెందిన విద్యార్థులకు మాత్రమే విద్య అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ విద్యావిధానంతో యూజీసీ స్థాయి నియంత్రణ స్థాయి నుంచి నామమాత్రపు స్థాయికి దిగిపోతుందని చెప్పారు. వివిధ ఆవిష్కరణల ద్వారా ప్రత్నామ్యాయ ప్రజా విద్యా వ్యవస్థను కేరళ అభివృద్ధి చేస్తోందని మంత్రి చెప్పారు.
ఈ సదస్సులో తమిళనాడు, మహారాష్ట్ర విద్యామంత్రలు కూడా పాల్గొన్నారు. నూతన విద్యా విధానాన్ని ఏకగ్రీవంగా వ్యతిరేకించారు. ఈ విద్యావిధానం సమాజంలో ఒక నిర్ధిష్ట వర్గానికి అన్యాయం చేసి, విద్యను ఆ వర్గానికి దూరం చేస్తుందని విమర్శించారు. నేషనల్ ఎలిజిబిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్), సెంట్రల్ యూనివర్శిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(సీయూఈటీ)ని కూడా మంత్రులు వ్యతిరేకించారు. తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కె పొన్ముడి మాట్లాడుతూ ఎన్ఈపీలో మూడు, ఐదు, ఎనిమిదో తరగతులకు ఉమ్మడి పరీక్షను నిర్వహించాలనే నిబంధన దేశంలో డ్రాపౌట్లను పెంచుతుందని తెలిపారు. నీట్, సీయూఈటీ పరీక్షలపైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విధానంతో కోచింగ్ సెంటర్లకు మళ్లీ ఆదరణ పెరుగుతుందని చెప్పారు. తమిళనాడు పాఠశాల విద్యాశాఖ మంత్రి అంబిత్ పొయ్యమొళి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బలహీన వర్గాల విద్యార్థుల పనితీరును పర్యవేక్షిస్తామనే నెపంతో స్కాలర్షిప్లను నిలిపేయాలనే కేంద్రం కుట్రకు నేషనల్ స్కాలర్షిప్ పొర్టల్ ఒక ఉదాహరణ అని తెలిపారు. మహారాష్ట్ర మంత్రి జితేంద్ర అవధ్ మాట్లాడుతూ రాష్ట్రాల హక్కులను హరించడానికి కేంద్రం వేసిన మరో ఎత్తుగడగా ఎన్ఇపిను అభివర్ణించారు. ఈ సదస్సులో ఎన్ఇపిని వత్యిరేకిస్తూ అనేక తీర్మానాలు ఆమోదించారు. విద్యను మళ్లీ రాష్ట్ర జాబితాలోకి తీసుకుని రావాలని విజ్ఞప్తి చేశారు.