Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శివలింగం ఉన్న ప్రాంతం వద్ద భద్రత ఏర్పాటుచేయండి : సుప్రీంకోర్టు
- రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలన్న వారణాసి కోర్టు
న్యూఢిల్లీ : దేశంలో మసీదు..మందిర్ వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. వారణాసిలో జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో వీడియోగ్రాఫీ సర్వేను వ్యతిరేకిస్తూ 'అంజుమన్ ఇంతెజామియా మసీద్ వారణాసి' నిర్వాహకులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, సుప్రీంకోర్టు మంగళవారం పిటిషన్‌పై విచారణ జరిపింది. మసీదులో ముస్లిం ప్రార్థనలను అడ్డుకోరాదని, శివలింగం లభ్యమైన ప్రాంతం వద్ద భద్రత ఏర్పాటుచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా శివలింగం బయటపడిన ఘటనపై వీడియోగ్రఫీ సర్వే నివేదికను ఈనెల 19లోగా సమర్పించాలని వారణాసి న్యాయస్థానం ఆదేశించింది. అదే సమయంలో సర్వే నివేదిక బాధ్యత నుంచి కోర్ట్ కమిషనర్ అజరు కుమార్ మిశ్రాను తొలగించింది. సర్వేకు అజరుకుమార్ మిశ్రా పూర్తిస్థాయిలో సహకరించడం లేదనే ఆరోపణలు రావడంతో ఆయన్ని తొలగించింది. స్పెషల్ కోర్టు కమిషనర్ విశాల్ సింగ్‌కు సర్వే నివేదిక బాధ్యతలు అప్పగించింది. శివలింగం ఉన్న ప్రాంతం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేయాలని, లోపలికి వెళ్లేందుకు ఎవర్నీ అనుమతించవద్దని వారణాసి కోర్టు పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించింది. మరోవైపు నివేదిక సమర్పించేందుకు రెండు రోజుల సమయం కావాలని అసిస్టెంట్ కోర్ట్ కమిషనర్ అజరు ప్రతాప్ సింగ్ న్యాయస్థానాన్ని కోరారు. దాంతో కోర్టు రెండు రోజుల గడువిచ్చింది.