Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 17 ఏండ్ల గరిష్టానికి ధరలు
- 5.08 శాతానికి టోకు ద్రవ్యోల్బణం ొ పెట్రో ధరల ఆజ్యం
న్యూఢిల్లీ : దేశంలో ధరలు దండిగా పెరుగుతూ.. తీవ్ర ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయి. వరుసగా 13వ మాసంలోనూ రెండంకెల స్థాయిలో ఎగిసిపడ్డాయి. ప్రస్తుత ఏడాది ఏప్రిల్‌లో టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యూపీఐ) ఏకంగా 15.08 శాతానికి ఎగిసి.. ఏకంగా రికార్డ్ స్థాయిలో 17 ఏండ్ల గరిష్టానికి చేరాయి. కూరగాయలు, ఇంధన, వంట నూనెల ధరలు భగ్గుమన్నాయి. 2021 మార్చిలో డబ్ల్యుపిఐ 10.74 శాతంగా నమోదయ్యింది. 2020 నవంబర్‌లో కనిష్టంగా 2.29 శాతంగా ఉండగా.. ఆ తర్వాత మాసాల్లో భారీగా పెరుగుతూనే వస్తోంది. మోడీ సర్కార్ అడ్డగోలుగా పెంచుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ప్రధానంగా ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తున్నాయి. ఇటీవల ఉక్రెయిన్, రష్యా పరిణామాలు మరింత ఒత్తిడిని పెంచాయి.
గడిచిన ఏప్రిల్‌లో పెట్రో, డీజిల్, ఇంధన ధరలు ఏకంగా 38.66 శాతం ఎగిశాయి. మార్చిలో వీటి ద్రవ్యోల్బణం 34.52 శాతంగా నమోదయ్యింది. గత నెలలో ముడి చమురు, సహజ వాయువు ద్రవ్యోల్బణం ఏకంగా 69.07 శాతంగా చోటు చేసుకుంది. ప్రస్తుత ఏడాదిలో ఇప్పటి వరకు డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా 4 శాతం పతనం కావడంతో దిగుమతి వస్తువులు భారం అయ్యాయి. కూరగాయలు, గోదుమలు, పళ్లు, ఆలు ధరలు పెరగడంతో అహారోత్పత్తుల ద్రవ్యోల్బణం 8.35 శాతంగా చోటు చేసుకుంది. తయారీ రంగం ఉత్పత్తులు, చమురు విత్తనాల ధరలు వరుసగా 10.85 శాతం, 16.1 శాతం చొప్పున ఎగిశాయి.ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయి నుంచి తగ్గకపోవడంతో వచ్చే జూన్‌లోనూ ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని ఇక్రా చీఫ్ ఎకనామిస్ట్ ఆదితి నయ్యర్ పేర్కొన్నారు. ప్రస్తుత ఏడాది ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ (సీపీఐ)7.79 శాతం పెరిగి ఎనిమిది ఏండ్ల గరిష్ట స్థాయికి చేరింది. ధరలు పెరుగుదల నేపథ్యంలోనే ఆర్బీఐ ఇటీవల రోపోరేటును 40 బేసిస్ పాయింట్లు పెంచి 4.40 శాతానికి చేర్చిన విషయం తెలిసిందే. వడ్డీ రేట్లు పెంచినంత మాత్రానా ధరలు వెంటనే తగ్గవని ఎస్బీఐ ఓ పరిశోధన పత్రంలో విమర్శించిన విషయం తెలిసిందే. అధిక ధరలతో ప్రజల కొనుగోలు, పొదుపు శక్తి హరించుకుపోతుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.