Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల కష్టాలు పట్టని మోడీ సర్కారు
- బడా వ్యాపారుల ప్రయోజనాలకే పెద్దపీట
- గోధుమల ఎగుమతుల నిషేధం సడలింపు అందుకే
న్యూఢిల్లీ : గోధుమల ఎగుమతులపై కొద్ది రోజుల క్రితం విధించిన నిషేధాన్ని సడలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈ నిర్ణయం వెనుక ప్రజల ప్రయోజనాల కన్నా బడా వ్యాపారుల ప్రయోజనాలే అధికంగా ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి.అన్ని నిత్యావసరాల వస్తువులతో పాటే గోధుమలు, గోధుమ పిండి ధరలు ఇటీవల కాలంలో అనూహ్యంగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఏడాది కాలంలో గోధుమల ధర 13 శాతం పెరిగింది. గత ఏడాది మ0 13వ తేది నాటికి గోధుమల ధర సగటున 28.80 రూపాయలు ఉండగా, ఈ ఏడాది మే 13 నాటికి 33.14 రూపాయలకు చేరింది. దీంతో గోధుమ పిండి ధర కూడా భారీగా పెరిగింది. ఇంత భారీ స్థాయిలో ధరలు పెరగడానికి విదేశాలకు పెద్ద ఎత్తున జరుగుతున్న ఎగుమతులు కూడా ఒక కారణం. ఉత్తర భారత దేశంలోని అనేక రాష్ట్రాల్లో గోధుమలే ప్రధాన ఆహారం కావడంతో ప్రజల్లో తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమైంది. దీంతో మే 14వ తేదిన గోధుమల ఎగుమతులను నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం సహజంగానే బడా వ్యాపారులకు ఆగ్రహం తెప్పించింది. ఒక వ్యూహం ప్రకారం రైతుల నుండి గోధుమల కొనుగోళ్లు నిలిపివేశారు. అక్కడక్కడ కొనుగోళ్లు చేసినా నామమాత్రపు ధర మాత్రమే చెల్లించారు. ఎగుమతుల నిషేధంతో బహిరంగ మార్కెట్లో గోధుమల ధరలు తగ్గినప్పటీకీ కనీస ధర కూడా పలకకపోవడంతో రైతాంగంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిని అవకాశంగా తీసుకుని గోధుమలను ఎగుమతులపై విధించిన ఆంక్షలను కొన్నింటిని కేంద్ర ప్రభుత్వం తాజాగా సడలించింది. రానున్న కొద్ది రోజుల్లో పూర్తి స్థాయి ఎగుమతులకు అనుమతి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఎగుమతుల నిషేధం ప్రకటించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకుని గోధుమలు కొనుగోలు చేసి ఉంటే రైతులు నష్టపోయే పరిస్థితి ఉండేది కాదు. ప్రజలకు కూడా తక్కువ ధరకే లభించి ఉండేవి. ఆ దిశలో చర్యలు తీసుకోవడానికి బదులు బడా వ్యాపారుల ప్రయోజనాలకే కేంద్రం మొగ్గు చూపింది. ఒక్క గోధుమల విషయంలోనే కాదు, ఇతర నిత్యావసర వస్తువుల్లోనూ కేంద్ర ప్రభుత్వానిది ఇదే వైఖరి!
ఐదేళ్లుగా ధరలు పైపైకే...!
నిత్యావసర వస్తువుల ధరలు ఐదేళ్లుగా పైకే ప్రయాణం చేస్తున్నాయి. వంట నూనెలు లీటరు 200 రూపాయలకు చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ పౌరసరఫరాల లెక్కల ప్రకారమే గోధుమల ధరలు ఐదేళ్ల కాలంలో 24శాతం, గోధమ పిండి 28 శాతం పెరిగింది. పప్పులు 20 నుండి 30 శాతం పెరుగుదలను నమోదుచేశాయి. బియ్యం 24 శాతం, కందిపప్పు 21శాతం, పెసరపప్పు 29 శాతం ధరలు పెరిగాయి. వంట నూనెల విషయానికొస్తే ఐదేళ్ల కాలంలో పామ్ఆయిల్ అత్యధికంగా128 శాతం పెరిగింది. వనస్పత్తి 112 శాతం, సన్ఫ్లవర్ 107 శాతం, సోయా 101 శాతం, ఆవనూనె 71 శాతం, వేరుశనగ నూనె ధర 41 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఇక పెట్రోలు, డీజల్, గ్యాస్ ధరల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వంట గ్యాస్ ధర ఏడాది కాలంలోనే 76 శాతం పెరిగింది.
మోడీ ప్రభుత్వం ఏం చేసింది ?
ధరలు చుక్కలను దాటి దౌడు తీస్తుంటే ఏ ప్రభుత్వమైనా వాటిని నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది. వరుసగా ఐదు సంవత్సరాల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతున్నా మోడీ ప్రభుత్వం ఆ దిశలో ఒక్కటంటే ఒక్క చర్య కూడా తీసుకోలేదు. అదే సమయంలో బడా వ్యాపారులకు లబ్ధిచేయడానికి పాకులాడింది. 2020లో కరోనా రక్కసి విరుచుకుపడుతూ, ప్రజలు తీవ్రమైన అభద్రతలో ఉన్న సమయంలో నిత్యావసర వస్తువుల సేకరణకు సంబంధించిన అనేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం మార్చి వేసింది. స్వేఛ్చా వ్యాపారం పేరిట సరుకుల నిల్వ, ధర నిర్ణయం వంటి అంశాల్లో ట్రేడర్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంది. ఏడాది పాటు జరగిన రైతాంగ ఉద్యమం తరువాత వీటిలో కొన్నింటిని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించినప్పటికీ ఆచరణలో అమలు కాలేదు. అదే సమయంలో అంతర్జాతీయంగా చోటు చేసుకున్న అనేక పరిణామాలను దృష్టిలో ఉంచుకుని నిత్యావసర వస్తువుల ఎగుమతులను పెద్ద ఎత్తున చేయడానికి కేంద్రం ప్రణాళికలు రూపొందించింది. దీంతో దేశంలోని సగటు వినియోగదారుడు ధరాఘాతానికి గురికాక తప్పనిస్థితి. ఏప్రిల్ నెల వినియోగదారుల సూచి ప్రకారం రిటైల్ ద్రవ్యోల్భణం 8 సంవత్సరాల్లో అత్యధిక స్థాయికి 7.79శాతానికి తాకింది. గ్రామీణ ద్రవ్యోల్భణం 8.38 శాతానికి చేరింది. ఆహారధాన్యాల ద్రవ్యోల్భణం కూడా 8.38 శాతానికి, గ్రామీణ ప్రాంతాల్లో 8.5 శాతానికి చేరింది.హోల్సేల్ ధరలు రికార్డు స్థాయిలో 14.55 శాతం పెరిగాయి.
నిపుణులు ఏం చెబుతున్నారు?
ధరాఘాతం నుండి ప్రజలను కాపాడటానికి పౌర సరఫరాల వ్యవస్థను పటిష్టం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాపారుల లాభాపేక్షను నియంత్రించడంతో పాటు, కార్పొరేట్లపై సంపద పన్నును విధించాలని చెబుతున్నారు. ఆహారధాన్యాలను, నిత్యావసర సరుకులను రైతుల నుండి కనీస మద్దతు ధరకు సేకరించి, వాటిని ప్రభుత్వమే నేరుగా వినియోగదారులకు తక్కువ ధరలకు అందించాలన్నది మరో సూచన. పెట్రో ఉత్పత్తులపైఎక్సైజ్ డ్యూటీని రద్దు చేయడం ద్వారా కూడా ధరలను అదుపులో ఉంచవచ్చని చెబుతున్నారు. వీటిని మోడీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందా?