Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8 శాతం పడిపోయిన ఎల్ఐసీ షేర్లు
ముంబయి : దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ తొలిరోజే తడబాటు పడింది. ఈ ఐపీఓలో తమకు షేర్లు కేటాయింపులు జరగలేదని సోమవారం పలువురు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేయగా.. స్టాక్స్ పొందిన ఇన్వెస్టర్లు మంగళవారం అమ్మకాలకు దిగారు. ఇష్యూ ధర రూ.949తో పోల్చితే బీఎస్ఈలో ఎల్ఐసీ షేర్ 8.62 శాతం నష్టంతో రూ.867.20 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ.860-920 మధ్య కదలాడింది. కాగా.. రూ.60 డిస్కౌంట్తో పొందిన పాలసీదారులు, రూ.45 రాయితీతో షేర్లను దక్కించుకున్న ఉద్యోగులు స్వల్పంగా నష్టపోయారు. ఇష్యూ ధర రూ.949తో ఎల్ఐసీ మార్కెట్ కాపిటలైజేషన్ రూ.6 లక్షల కోట్లుగా ఉండగా.. షేర్ ముగింపు ధరతో పోల్చితే రూ.5.57 లక్షల కోట్లకు తగ్గింది. ఈ పరిణామంతో ఒక్క పూటలోనే సంస్థ విలువ రూ.42,500 కోట్లు తగ్గిపోయింది. ప్రభుత్వ కార్యక్రమాలు, కంపెనీలు, విత్త సంస్థలకు పెట్టుబడులను సమకూర్చే ఎల్ఐసీకి నిధుల అవసరం లేకున్నా.. అనవసరంగా ఆ సంస్థ వాటాలను ప్రభుత్వం మార్కెట్ శక్తులకు కట్టబెట్టింది. కార్పొరేట్ల కోసం వేసిన ఈ ఎత్తుగడలో ఎల్ఐసీ వాస్తవ విలువ కంటే చౌకగా వాటాలను విక్రయించి.. ఆపై మార్కెట్లోనూ డిమాండ్ లేకపోవడంతో ఈ బీమా సంస్థ విలువ మరింత తగ్గిపోవడానికి కేంద్ర ప్రభుత్వం కారణమైంది. భవిష్యతులో ఎల్ఐసీ షేర్లకు డిమాండ్ పెరుగుతుందని.. అలాగే అంటిపెట్టుకోవాలని దీపమ్ సెక్రెటరీ తూహిన్ కాంత్ పాండే సూచించారు. షేర్ల కేటాయింపుల్లో అవకాశం దక్కని వారు సెకండరీ మార్కెట్లో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతారని ఎల్ఐసీ చైర్మెన్ ఆర్ సుకుమార్ పేర్కొన్నారు.
సెన్సెక్స్ 1300 పాయింట్ల పరుగు
కొనుగోళ్ల మద్దతుతో మంగళవారం బిఎస్ఇ సెన్సెక్స్ 1,345 పాయింట్లు లేదా 2.54 శాతం పెరిగి 54,318కి చేరింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 417 పాయింట్లు రాణించి 16,259 వద్ద ముగిసింది. బిఎస్ఇలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.5 శాతం, 2.8 శాతం చొప్పున లాభపడ్డాయి.