Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారత్న , నవరత్న , మినీ రత్నాల అమ్మకానికి కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగల్
- వేగంగా ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ
ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు శరవేగంగా కట్టబెట్టడానికి మోడీ సర్కారు సిద్ధమైంది. దీనిలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థల బోర్డు ఆఫ్ డైరక్టర్లకు అపరిమితంగా అధికారాలను కట్టబెట్టింది. డైరక్టర్లు ఎప్పుడు తల్చుకుంటే అప్పుడు సంస్థను పూర్తి స్థాయిలో తెగనమ్మడానికి వీలుగా మార్గదర్శకాలను సవరించాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
న్యూఢిల్లీ : ఇప్పటిదాకా ఉన్న విధానం ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థల డైరక్టర్ల బోర్డుకు పూర్టి స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణకుగానీ, సంస్థను మూసివేయడానికి గానీ అధికారులు లేవు. ఈ మేరకు తీర్మానం చేసే అధికారం మాత్రమే ఆ సంస్థల బోర్డులకు ఉంది. ఆ తీర్మానం ప్రతిని క్యాబినెట్‌కు లేదా, ఆర్థిక వ్యవహారాలపై క్యాబినెట్ వేసిన కమిటీ (సీసీఈఏ)కుగానీ పంపాలి. అక్కడ నుండి ఆమోదం తీసుకోవాలి. ఆ తరువాత ప్రతి దశ సమాచారాన్ని వారికి తెలియ చేయాలి. ఈ ప్రక్రియ ఆచరణలో పూర్తిస్థాయిలో అమలు జరగ డానికి చాలా సమయం పడుతోంది. కొన్ని ప్రతిపాదనలను చర్చించడానికి కూడా సమయం ఉండటం లేదు. దీంతో ప్రయివేటీకరణ ప్రక్రియ నిర్ధేశించిన లక్ష్యాల మేరకు జరగడం లేదని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడు తున్నది. ఈ నేపథ్యంలో ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్టిమెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపమ్) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
ఇకనుండి ఇలా...
దీపమ్ సిఫార్సుల మేరకు కేంద్ర మంత్రిమండలి తీసుకున్న తాజా నిర్ణయాల ప్రకారం సంస్థల డైరక్టర్ల బోర్డకు అపరిమితంగా అధికారాలు దఖలు పడనున్నాయి. దీని ప్రకారం ప్రధాన సంస్థతో పాటు అనుబంధ సంస్థల్లోనూ పెట్టుబడుల ఉపసంహరణ, మూసివేతకు డైరక్టర్లకు అధికారులు దఖలు పడతాయి. ఇక నుంచి బోర్డు నిర్ణయంతో డైరక్టర్లే ఈ చర్యలకు ఉపక్రమించవచ్చు. క్యాబినెట్కుగానీ, సీసీఈఏకు గానీ తెలియచేయడం, అనుమతి తీసుకోవడం వంటివి చేయనవసరం లేదు. బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్న వెంటనే ఆ మేరకు నోటిపికేషన్ జారీ చేయడం, బిడ్లను ఆమోదించడం, ఆమోదయోగ్యంగా బిడ్లను దాఖలు చేసిన వారికి కట్టబెట్టడం వంటి చర్యలను నేరుగా బోర్డే చేయవచ్చు. ఒకవేళ ఆమోదయోగ్యమైన ధరకు బిడ్ దాఖలు కాకపోతే సంస్థను మూసివేసే అధికారం కూడా బోర్డుదే! ఇలా చేయడం ద్వారా సాధ్యమైనంత త్వరగా ప్రయివేటీకరణ ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు, వ్యతిరేకత కూడా పెరగకుండా ఉంటుందని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు నష్టాల్లో ఉన్న కంపెనీలను అమ్ముతామంటూ చెప్పిన కేంద్రం ఇప్పుడు లాభాల్లో ఉన్న మహారత్న, నవరత్న, మినీ రత్న వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ మరింత వేగంగా పెట్టుబడులు ఉపసంహరించాలని నిర్ణయించింది. ఆ సంస్థలోనూ బోర్డు ఆఫ్ డైర్టక్టర్లకే అందుకు అధికారాలను అప్పగించింది.
ఇథనాల్ తప్పనిసరి
బయో ఫ్యూయల్ పాలసీలో కేంద్రం పలు మార్పులు చేస్తూ ఆమోదం తెలిపింది. బయో ఫ్యూయల్స్ జాతీయ విధానం-2018లో సవరణలను చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. కొత్తగా ఫీడ్ స్టాక్ కు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. 2030 నాటికి పెట్రోల్‌లో 20 శాతం ఇతర ఇథనాల్ కలపడం తప్పనిసరి చేయనున్నారు. బయో ఫ్యూయల్ ప్రోగ్రాం కింద స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏర్పాటుకు ప్రోత్సాహకాలివ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది.