Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్యాక్టరీ గోడ కూలి..12మంది మృతి
వదోదరా : గుజరాత్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక మోర్బీలోని హల్వాద్ పారిశ్రామిక ప్రాతంలోని సాగర్ ఉప్పు కర్మాగారం గోడ కూలి 12మంది మరణించారు. మరో ముగ్గురు శిథిలాల కిందే ఇరుక్కుపోయినట్టు భావిస్తున్నారు. విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల్లో ఐదుగుర పురుషులు, నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారని తెలిసింది. వీరంతా కచ్ ప్రాంతానికి చెందినవారని మోర్బీ జిల్లా కలెక్టర్ జె.బి.పటేల్ చెప్పారు.
పోలీస్ ఉన్నతాధికారులు మీడియాకు తెలియజేసిన కథనం ప్రకారం, సాగర్ ఉప్పు కర్మాగారంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 15 నుంచి 20 అడుగుల ఎత్తున్న గోడ హఠాత్తుగా కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న 13మంది మట్టిపెళ్లల కింద కూరుకుపోయారు. ప్రమాద ఘటన వార్త తెలుసుకొని రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకున్నప్పటికీ, అప్పటికే 12మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తీవ్రగాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడని పోలీస్ ఇన్స్పెక్టర్ కె.జె.మాథుకియా మీడియాకు తెలిపారు. ''ఉప్పు తయారీ ప్యాకింగ్ అనంతరం గోడ వెంబడి నిల్వ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. చనిపోయినవారంతా ప్రమాద సమయంలో ఉప్పు ప్యాకెట్లను పెద్ద పెద్ద సంచుల్లో సర్దుతున్నారు'' అని కె.జె.మాథుకియా అన్నారు.