Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్కింగ్ కమిటీ, అధ్యక్ష, ప్రధానకార్యదర్శుల ఎన్నిక
న్యూఢిల్లీ : ఆల్ ఇండియా ఫిషర్స్ అండ్ ఫిషరీస్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఎఫ్‌ఎఫ్‌డబ్ల్యూఎఫ్) మూడవ జాతీయ సదస్సు ఇటీవల పశ్చిమబెంగాల్లోని ఉలుబెరియాలో నిర్వహించారు. ఈ నెల 11, 12 తేదీల్లో జరిగిన ఈ సదస్సుకు దేశంలో తొమ్మిది రాష్ట్రాల నుంచి 189 మంది ప్రతినిధులు హజరయ్యారు. సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ సదస్సును ప్రారంభించగా, ఎఐఎఫ్ఎఫ్డబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి కె హేమలత నివేదికను సమర్పించారు. ఈ నివేదికపై ప్రతినిధులు సవివరంగా చర్చించారు. మత్స్యకారులు, మత్స్య కార్మికుల పని స్థితిగతులపై అధ్యయనం చేసి వారిని సంఘటితం చేసేందుకు నిరంతరం కృషి చేయాలని చర్చల్లో ప్రతినిధులు నిర్ణయించారు. అలాగే, ఈ సదస్సులో 41 మంది సభ్యులతో కూడిన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు, ఇందులో 15 మంది ఆఫీస్ బేరర్లు ఉన్నారు. అధ్యక్షుడిగా దేబాశిష్ బర్మన్ (పశ్చిమ బెంగాల్), ప్రధాన కార్యదర్శిగా పుల్లువిలా స్టాన్లీ (కేరళ), కోశాధికారిగా జి మమత (మధ్య) ను ఎన్నుకున్నారు. 'బ్లూ ఎకానమీ పాలసీ'ని ఉపసంహరించుకోవాలని సదస్సు ఏకగ్రీవంగా డిమాండ్ చేసింది. మత్స్యకారుల జీవనోపాధి, నివాసాలను రక్షించే విధానాలను అవలభించాలని విజ్ఞప్తి చేసింది. పర్యావరణాన్ని తద్వారా మొత్తం మానవ జనాభాను రక్షించడానికి క్రియాశీలక చర్యలు తీసుకోవాలని సంబంధిత ప్రభుత్వాలను సదస్సు డిమాండ్ చేసింది. మత్స్యకారులు, శ్రామిక వర్గ ప్రజలంతా ఐక్యంగా ఉండాలని, కార్పొరేట్లకు సేవ చేసే, సమాజాన్ని మతంపేరుతో విభజించే హేయమైన ప్రయత్నాలను ఐక్యంగా ఓడించాలని సదస్సు పిలుపునిచ్చింది. అదేవిధంగా, రాయితీపై కిరోసిన్ అందించాలని, మత్స్యకారులు, మత్స్య అనుబంధ కార్మికులందరికీ ఉచితంగా బీమా ప్రీమియం అందించి రూ.10 లక్షల గ్రూప్ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని సదస్సు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మత్స్యకారులకు గుర్తింపు కార్డుల జారీ, నెలకు రూ. 3000 పెన్షన్, ఉచిత ఆరోగ్య సంరక్షణ, వారి పిల్లలకు ఉచిత విద్య, తీరప్రాంత కోతను నివారించడానికి సముద్ర గోడను నిర్మించడం, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయడం, ప్రైవేటీకరణను నిలిపివేయాలని వంటి డిమాండ్లను కూడా సదస్సు చేసింది.