Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిపాదిత చట్టాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలి..
- మహిళా హక్కులకు, స్వాతంత్య్రానికి సంకెళ్లు : మహిళా సంఘాలు
న్యూఢిల్లీ : మహిళల వివాహ వయస్సును 21ఏండ్లకు పెంచడాన్ని దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముసాయిదా చట్టం ఆమోదం పొందితే మహిళా స్వాతంత్య్రానికి సంకెళ్లు పడతాయని, సమాజంలో అనేక సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈమేరకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్పర్సన్ సహస్రబుద్ధను కలుసుకున్న మహిళా సంఘాల నాయకులు సంయుక్తంగా ఒక మెమోరాండం సమర్పించాయి. మహిళల వివాహ వయస్సు 18ఏండ్ల నుంచి 21ఏండ్లకు పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ముసాయిదా చట్టాన్ని తీసుకురాబోతోంది. ఈ నిర్ణయాన్ని ఆల్ ఇండియా డెమొక్రాటిక్ వుమెన్స్ అసోసియేషన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వుమెన్, ఆల్ ఇండియా ప్రొగ్రెస్సీవ్ వుమెన్స్ అసోసియేషన్, ప్రగతిశీల మహిళా సంఘటనా, ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక్ సంఘటన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ ఆందోళనను, అభ్యంతరాలను తెలియజేస్తూ మహిళా సంఘాల ప్రతినిధులు సంయుక్తంగా మెమోరాండంను సమర్పించారు. 21ఏండ్లలోపు మహిళల వివాహాల్ని నేరంగా ముసాయిదా చట్టం పేర్కొంటోంది. వాటిని బాల్య వివాహాలుగా నిర్వచించింది. దీనివల్ల ఆ మహిళల హక్కులకు భంగం వాటిల్లుతుందని, సాంప్రదాయ ఆరోగ్య వ్యవస్థ సేవలు పొందే అవకాశం లేకుండా పోతుందని మెమోరాండంలో మహిళా సంఘాలు తెలిపాయి.
మహిళల వివాహ వయస్సును పెంచే నిర్ణయాన్ని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. ''ఇలాంటి చట్టాలు చేయటం కన్నా, ఐసీడీఎస్, విద్యాహక్కును సమర్థవంతంగా అమలుజేయాలి. మహిళలకు, చిన్నారులకు పోషకారాన్ని అందించే సంక్షేమ కార్యక్రమాల్ని విస్తరించాలి'' అని తెలియజేశాయి.
ప్రతిపాదిత చట్టం వల్ల లింగ సమానత దెబ్బతింటుందని, 18ఏండ్ల మహిళ ప్రభుత్వాన్ని ఎంచుకుకోగలదు, జీవత భాగస్వామిని ఎంచుకోలేదా? అని మహిళా సంఘాల ప్రతినిధులు కేంద్రాన్ని ప్రశ్నించారు. వివాహ వయస్సు పెంపువల్ల మహిళా సాధికారిత మరింత దెబ్బతింటుందని హెచ్చరించారు. ప్రతిపాదిత చట్టం రాజ్యాంగ విరుద్ధమని, మహిళా హక్కుల్ని తీవ్రంగా భంగపరుస్తుందని వారు మెమోరాండంలో తెలియజేశారు.