Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీం సంచలన తీర్పు
న్యూఢిల్లీ : మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హత్య కేసులో దోషి ఎజి పెరారివలన్‌ను విడుదల చేయాల్సిందిగా సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. జీవిత ఖైదును రద్దు చేయాలంటూ పెరరివలన్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై బుధవారం జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ బిఆర్ గవారు, జస్టిస్ ఎఎస్ బోపన్నలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. రాజ్యాంగంలోని 142వ అధికరణం ప్రకారం విడుదలకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు పేర్కొంది. పెరారివాలన్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతికి పంపాలని గవర్నర్ తీసుకున్న నిర్ణయానికి రాజ్యాంగపరమైన మద్దతు లేదని సుప్రీంకోర్టు తెలిపింది.
ఆర్టిక్ 161 ప్రకారం హత్య కేసుల్లో దోషులు చేసిన క్షమాభిక్ష అభ్యర్థనల విషయంలో గవర్నర్‌కు సలహాలు ఇచ్చే అధికారం, సహాయం చేసే అధికారం రాష్ట్రాలకు ఉందని పేర్కొంది. సెక్షన్ 302 (హత్య) కింద కేసులో క్షమాభిక్ష ఇచ్చే అధికారం రాష్ట్రపతికే ఉందని, గవర్నర్‌కు కాదని కేంద్ర ప్రభుత్వం చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది.
ఈ వివాదం ఆర్టికల్ 161ని డెడ్ లెటర్‌గా మారుస్తుందని పేర్కొంది. రాజీవ్ గాంధీ హత్య కేసులో 19 ఏళ్ల వయసులో దోషిగా తేలిన పెరారివాలన్ 31 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు.
1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తుండగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏడుగురిని నిందితులుగా సుప్రీంకోర్ట్ నిర్ధారించింది. వారందరికీ మరణశిక్ష విధించింది. 2014లో వారి క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో రాష్ట్రపతి జాప్యం చేశారని పేర్కొంటూ సుప్రీంకోర్టు వారి శిక్షను జీవిత ఖైదుగా మార్పు చేసింది. నిందితుడు పెరరివలన్ విడుదలతో మరో ఆరుగురు నిందితుల విడుదలకు మార్గం సుగమం కానుందని
పెరారివలన్‌కు మద్దతుగా మానవహారం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో చెన్నైలోని చెపాక్ గెస్ట్ హౌస్ వద్ద పెరారివలన్ తల్లి అర్పుతమ్మాళ్ సహా పలువురు మానవ హారం నిర్వహించారు.
పెరారివలన్‌కు స్టాలిన్ శుభాకాంక్షలు
పెరారివలన్ విడుదల ఒక వ్యక్తి విజయం మాత్రమే కాదని, సమాఖ్యవాదం, రాష్ట్రాల స్వయంప్రతిపత్తికి ఒక ఉదాహరణగా నిలిచిందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 32 ఏళ్లపాటు జైలు జీవితం గడిపి, ఎట్టకేలకు స్వేచ్ఛను పొందుతున్న ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, స్వాగతం పలుకుతానని స్టాలిన్ తెలిపారు. పెరారివలన్ విడుదలకు సుదీర్ఘ పోరాటం చేసిన అతని తల్లి అర్పుతమ్మాళ్‌ను ప్రశంసించారు.