Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్ 1400 పాయింట్ల పతనం
- రూ.6.71 లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబయి : అధిక ధరలు భారత మార్కెట్లను బెంబెలెత్తించాయి. అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలకు తోడు దేశీయంగా ఎగిసి పడుతోన్న ద్రవ్యోల్బణం, మాంద్యం పొంచి ఉందన్న సంకేతాలు మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఈ పరిణామాలతో గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ 1,416 పాయింట్లు లేదా 2.61 శాతం పతనమై 52,792కు పడిపోయింది. ఇంట్రాడేలో ఏకంగా 52,699 కనిష్టానికి దిగజారింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 430 పాయింట్లు లేదా 2.65 శాతం కోల్పోయి 15,809 వద్ద ముగిసింది. మార్చి 2020 తర్వాత ఒక్క పూటలో ఈ స్థాయిలో సూచీలు పడిపోవడం ఇదే తొలిసారి. బీఎస్ఈ మార్కెట్ కాపిటలైజేషన్ 6.71 లక్షల కోట్లు ఆవిరై రూ.249.40 లక్షల కోట్లకు పడిపోయింది. అన్ని రంగాల సూచీలు ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు భారీగా పెరగడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం, వడ్డీ రేట్ల పెంపు తదితర అంశాలు మార్కెట్లను తీవ్ర ఒత్తిడికి గురి చేశాయని నిపుణులు పేర్కొంటున్నారు. మాంద్యం భయాలతో గత రెండేళ్లలో ఎప్పుడూ లేని స్థాయిలో బుధవారం అమెరికా మార్కెట్లు పతనం కావడం ఇతర దేశాల మార్కెట్లను ఆందోళనకు గురి చేశాయి. వాల్‌స్ట్రీట్‌లో డోజోన్స్ 3.2 శాతం, ఎస్అండ్పీ 3.6 శాతం, నాస్డాక్ కాపోజిట్ 4.3 శాతం చొప్పున నష్టపోయాయి.నిఫ్టీలో మిడ్ క్యాప్. స్మాల్ క్యాప్ సూచీలు 3 శాతం, 2 శాతం చొప్పున నష్టపోయాయి. సెన్సెక్స్-30లో విప్రో, హెచ్‌సిఎల్ టెక్నలాజీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్ షేర్లు అత్యధికంగా నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్, పవర్ గ్రిడ్ షేర్లు మాత్రమే స్వల్పంగా లాభపడ్డాయి. ఇంతక్రితం సెషన్లో విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.1,254 కోట్ల ఈక్విటీలను విక్రయించి.. తమ సంపదను తరలించుకుపోయారు.