Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెలలో రెండోసారి పెరిగిన సిలిండర్ ధర
- హైదరాబాద్‌లో రూ.1,055
న్యూఢిల్లీ : గ్యాస్ సిలిండర్ సామాన్యులకు గుదిబండలా మారుతోంది. దేశ ప్రజలపై మరోసారి కేంద్రం వంట గ్యాస్ పై భారం మోపింది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోలు ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడుతుండగా గోరుచుట్టు రోకలిపోటులా.. వరుసగా గ్యాస్ సిలిండర్ ధరలు మోడీ ప్రభుత్వం పెంచుకుంటూ పోతోంది. అంతర్జాతీయ ఇంధన రేట్లు స్థిరపడిన తర్వాత కూడా.. ఈ నెలలో సిలిండర్ ధర రెండవసారి పెరిగింది. దీంతో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.1,000 మార్కు దాటింది. దేశంలో వంటగ్యాస్ ధర గురువారం మరోసారి భగ్గుమన్నాయి. దేశీయ వంటగ్యాస్ ఎల్పీజీ ధర సిలిండర్‌కు రూ.3.50 చొప్పున పెంచారు. కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్ల ధర నోటిఫికేషన్ ప్రకారం సబ్సిడీ లేని ఎల్పీజీ ఇప్పుడు దేశ రాజధానిలో 14.2 కిలోల సిలిండర్ ధర 1,003కు పెరిగింది. ముంబయిలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.1,002.50 అయితే, చెన్నైలో రూ.1,018.50, కోల్‌కతాలో రూ.1,029 ఉంది.హైదరాబాద్‌లో రూ.1,055కి చేరింది. మే 7న సిలిండర్‌కు రూ.50 పెంచారు. అంతకు ముందు మార్చి 22న కూడా అదే మొత్తంలో ధరలు పెరిగాయి. ఏప్రిల్ 2021 నుంచి సిలిండర్‌కి రూ.193.5 చొప్పున ధరలు పెరిగాయి. వాణిజ్య సిలిండర్ ధర రూ.8 పెరిగింది. ఇక ఏడాది కాలంగా కమర్షియల్ సిలిండర్ ధరలయితే అడ్డు అదుపు లేకుండా పెరుగుతూనే ఉన్నాయి. వంటగ్యాస్ ధర పెంపుతో సామాన్యులపై అదనపు భారం పడుతోంది. పెరిగిన ధరలు అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. దేశంలో చాలా నగరాల్లో ఎల్పీజీపై ప్రభుత్వం ఎటువంటి సబ్సిడీని చెల్లించటం లేదు. ఉజ్వల పథకం కింద ఉచిత కనెక్షన్ పొందిన పేద మహిళలతో సహా వినియోగదారులు అందించే రీఫిల్ ధర నాన్-సబ్సిడైజ్డ్ లేదా మార్కెట్ ధర ఎల్పీజీకి సమానంగా ఉంటుంది.