Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దీనిపై చట్టాలు చేసే అధికారం కేంద్ర, రాష్ట్రాలకుంది
- పన్నుల విషయంలో 246ఏ ప్రకారం సమాన అధికారాలు
- ఒకరి ఆదేశాలను మరొకరిపై బలవంతంగా రుద్దొద్దని వ్యాఖ్య
న్యూఢిల్లీ : వస్తు సేవల పన్ను (జీఎస్టీ)పై చట్టాలు చేసే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడాల్సిన అవసరంలేదని పేర్కొంది. పన్నుల విషయంలో 246ఏ ప్రకారం కేంద్రం, రాష్ట్రం సమానమనీ, ఒకరి ఆదేశాలను మరొకరిపై బలవంతంగా రుద్దొద్దని స్పష్టంచేసింది. సముద్ర సరుకు రవాణా దిగుమతిదారులపై ఏకీకృత వస్తు సేవల పన్ను (ఐజీఎస్టీ) విధిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దుచేస్తూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. కేంద్ర, రాష్ట్రాలకు సమాన అధికారాలున్నాయని చెబుతూనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు అవసరమని జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తేల్చిచెప్పింది. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలు కావాలనుకుంటే వేర్వేరు చట్టాలు చేసుకోవచ్చని తెలిపింది. పన్ను విధింపు అంశం, దానిపై చట్టాలు చేసే అధికారం కేంద్రంతో పాటు రాష్ట్రాలకూ ఉందని పేర్కొంది. జీఎస్టీ కౌన్సిల్ సిఫారసు లన్నింటికీ రాష్ట్రాలు కట్టుబడి ఉండవనీ, అవి కేవలం ఒప్పించే విలువ మాత్రమేనని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది.ఆచరణీయ పరిష్కారాన్ని సాధించేందుకు జీఎస్టీ కౌన్సిల్ సామరస్యపూర్వకంగా పనిచేయాల్సిన అవసరాన్ని కోర్టు నొక్కి చెప్పింది. కో-ఆపరేటివ్ ఫెడరలిజంలో జీఎస్టీ చట్టాలను రూపొందించేటప్పుడు కేంద్రం, రాష్ట్రాలు ''స్వయం ప్రతిపత్తి, స్వతంత్రత'' పొందాయని జస్టిస్ చండ్రచూడ్ అన్నారు. 'సమాఖ్య వ్యవస్థ అనేది సమాజ అవసరాలను తీర్చడానికి ఒక సాధనం. ప్రజాస్వామ్యం, ఫెడరలిజం ఒకదానికొకటి పరస్పరం ఆధారపడి ఉంటాయి. బాగా పనిచేసే ప్రజాస్వామ్యంలో మాత్రమే ఫెడరలిజం స్థిరంగా ఉంటుంది' అని పేర్కొంది.