Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్ఈపీ వెనుక బీజేపీ ప్రత్యేక ఎజెండా
- జాతి నిర్మాతలైన టీచర్స్ ఉద్యమించాలి :ఎస్టీఎఫ్ఐ మహాసభ ప్రారంభ సభలో జస్టిస్ చంద్రు
అమరావతి : విద్య అంగట్లో సరకుగా మారిందని, కొనుక్కోగలిగిన స్తోమత ఉన్న వారికే జ్ఞానం అనే సిద్ధాంతం స్థిరపడిందని మద్రాసు హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ కె చంద్రు చెప్పారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానానికి ప్రత్యేక ఎజెండా ఉందన్నారు. ఉపాధ్యాయులు జాతి నిర్మాతలని, వారు జరుపుతున్న పోరాటాలు వారి స్వంత ఆర్థిక ప్రయోజనాల కోసం కాదని, యావత్ సమాజ అభ్యున్నతి కోసమని అన్నారు. ఎస్టీఎఫ్ఐ ఉద్యమం ఆ లక్ష్యంతోనే సాగుతోందని పేర్కొన్నారు. ఈ నెల 20-22 మూడు రోజులపాటు విజయవాడలో నిర్వహిస్తున్న స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) 8వ జాతీయ మహాసభలను శుక్రవారం జస్టిస్ చంద్రు ప్రారంభించి ప్రసంగించారు. రాజ్యాంగ నిర్మాతలు 121(ఎ) ఆర్టికల్‌లో 6-14 ఏండ్ల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య అమలు చేయాలని నిర్దేశించారు. రాజ్యాంగం అమల్లోకొచ్చి 72 సంవత్సరాలైనా అమలుకు నోచుకోలేదు. ఈ వైఫల్యానికి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనే తేడా లేదు. 50 శాతం పాఠశాల విద్య, ఉన్నత విద్య ప్రయివేటైపోయింది. విద్య మార్కెట్ మర్చంట్స్ చేతుల్లో సరుకుగా మారింది. కొనుక్కోగలిగితేనే విద్య. నర్సరీ కోసం రూ.లక్ష ఫీజు వసూలు చేసే కార్పొరేట్ సంస్థలున్నాయి. టీచింగ్ షాపులు పుట్టుకొస్తున్నాయి. విద్యా వ్యవస్థ ఎవరి కోసం ఉంది ఎవరు నియంత్రిస్తున్నారో గమనించాలి. ప్రయి వేటు సంస్థల్లో పేదలకు 25 శాతం సీట్లు కేటాయించినా, ఫీజులు కట్టేవారికి ఒక తరహా తరగతి, ఫీజులు కట్టని వారికి మరొక తరహా తరగతి అమల్లో ఉంది. ఇక సామాజిక న్యాయం ఎక్కడిది? విద్యా వ్యవస్థ పెనుసవాళ్లను ఎదుర్కొంటోంది. కోవిడ్ వచ్చాక సవాళ్లు తీవ్రమయ్యాయి.
ప్రత్యేక ఎజెండా ఉంది
బీజేపీ సర్కారు తెచ్చిన 2020- నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) వెనుక ప్రత్యేక ఎజెండా ఉందని చంద్రు స్పష్టం చేశారు. తొలుత రాజ్యాంగంలో విద్య సబ్జెక్టు రాష్ట్రాల పరిధిలోనే ఉంది. రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో చేర్చారు. పాలసీ తెచ్చేటప్పుడు విశాల ప్రాతిపదికన, భాగస్వామ్య సంస్థలు వ్యక్తులతో పాటు రాష్ట్రాలతో చర్చించాలి. కేంద్రం ఆ పని చేయలేదు. కేరళ, తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయి. విద్యా హక్కు చట్టానికి ఎన్ఈపీ విరుద్ధం. 1965లో వేసిన కొఠారి కమిషన్ పలు మేలిమి సిఫారసులు చేసింది. స్కూల్ ఎడ్యూకేషన్‌పై నిర్ణయాలు చేసే అధికారం రాష్ట్రాలకు ఇవ్వమని కమిషన్ చెప్పింది. ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధించాలని మహాత్మా గాంధీ సైతం చెప్పారు. బ్రిటిష్ వారసత్వం, విదేశాల్లో ఉద్యోగాల కోసం ఇంగ్లీష్‌కు మళ్లుతున్నారు.
జ్యుడీషియరీ విఫలం
విద్య అనేది ప్రాథమిక హక్కు అని తీర్పు చెప్పిన న్యాయస్థానాల్లోనే ప్రయివేటీకరణకు అనుకూలంగా తీర్పులు వచ్చాయని చంద్రు ఉదహరించారు. రిజర్వేషన్లు చెత్త అని వ్యాఖ్యానించిన గుజరాత్ హైకోర్టు జడ్జిపై పార్లమెంట్లో అభిశంసన వరకు వెళ్లింది. ఆయన సారీ చెప్పి తీర్పు పాఠాన్ని సవరించారు. ఆయనకే బీజేపీ సర్కారు సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమోషన్ ఇచ్చింది. 2028లో ఆయన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి అవుతారు. రాజ్యాంగం ప్రకారం యూనియన్ పెట్టుకొనే, సమ్మె చేసే హక్కు ఉంది. ఆ హక్కును నిషేధిస్తూ కోర్టులు తీర్పులు చెపుతున్నాయి. కర్నాటకలో హిజాబ్ వివాదం వలన 20 వేల మంది ఫైనల్ పరీక్షలు రాయలేదు. విద్యావ్యవస్థలో వర్ణాశ్రమ బయలుదేరింది. చరిత్రను, సంఘ సంస్కర్తలను, సామాజిక వేత్తల జీవిత గాధలను, పాఠపుస్తకాల్లో సిలబస్‌ను ఎడిట్ చేయడమో, తొలగించడమో చేస్తోంది. అసోంలో బీఫ్‌ను టిఫిన్ బాక్స్‌లో తెచ్చుకున్నందుకు అరెస్ట్ చేశారు. బీజేపీ రాజ్యాంగ పీఠిక పేర్కొన్న సర్వసత్తాక గణతంత్ర లౌకిక ప్రజాస్వామ్య సోషలిస్టు రాజ్యం స్ఫూర్తిపైనే దెబ్బకొడుతోంది. పిల్లలను భావిభారత పౌరులుగా తీర్చి దిద్దాల్సిన టీచర్స్‌పై పోరాడాల్సిన బాధ్యతా ఉంది... అని చంద్రు పిలుపునిచ్చారు. తాను ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఉద్యమంలో పని చేశానని, లాయర్‌గా విద్యార్ధుల, ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడానని, ఇది తన కుటుంబం అని వివరించారు. జై భీమ్ సినిమా గురించి ప్రస్తావించారు. ఎఐఎస్జీఈఎఫ్ జనరల్ సెక్రెటరీ శ్రీకుమార్ మాట్లాడుతూ నయా-ఉదారవాద విధానాలు అమలు చేస్తున్న దేశాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఊడుతున్నాయని, మన దేశంలోనూ అదే జరుగుతోందని చెప్పారు. బీజేపీ మతతత్వ పార్టీ అని, ఆర్ఎస్ఎస్ దాన్ని నడిపిస్తోందని, లౌకికవాదానికి, ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని అన్నారు. ఎన్ఈపీ ఆర్ఎస్ఎస్ ఎజెండా అని, సమస్యలపై జరిగే పోరాటాలను మతతత్వంతో పక్కదారి పట్టిస్తోందని తెలిపారు. ఎస్టీఎఫ్ఐ అధ్యక్షులు అభిజిత్ ముఖర్జీ సభకు అధ్యక్షత వహించగా ఉపాధ్యక్షులు కె రాజేంద్రన్ వందన సమర్పణ చేశారు.