Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్, మతోన్మాద విధానాలను ప్రతిఘటిద్దాం
- నేడు కేరళ ఏది ఆలోచిస్తుందో.. దేశమంతా అదే ఆలోచిస్తుంది
- శ్రామికవర్గ సమైక్య, సమరశీల ఉద్యమాలకు సిద్ధమవుదాం : వ్యవసాయ కార్మిక సంఘం కేరళ రాష్ట్ర మహాసభలో ఏఐఏడబ్ల్యూయూ జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ పిలుపు
న్యూఢిల్లీ : రాష్ట్ర ప్రభుత్వాలకున్న పరిమిత అధికారాలతోనే కేరళలో వామపక్ష ప్రభుత్వం ప్రజా అనుకూలమైన విధానాలను అనుసరిస్తోందని, ఈ విధానాలే దేశానికి ఆదర్శమని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ అన్నారు. కేరళ విధానాలే నేడు దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గం గానూ,దేశాభివృద్ధికి దిక్సూచిగానూ ఉంటాయని పేర్కొన్నారు. మూడు రోజులుగా జరుగుతున్న కేరళ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలో శుక్రవారం బి. వెంకట్ ముఖ్య అతిథిగా పాల్గొని ఉపన్యసించారు. కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా అనుకూల విధానాలు కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి, కార్పొరేట్ శక్తులకు కంటగింపుగా మారాయని అన్నారు. స్థానిక ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ కలిసి కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను అడ్డుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలు కూడా వారి మాయలో పడటం విచారకరమని ఆయన అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతుందని, ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని విదేశీ, స్వదేశీ కార్పొరేట్ శక్తులకు కట్టపేడుతుందని విమర్శించారు. మరోవైపు ప్రత్యామ్నాయ విధానాలతో కేరళ ప్రభుత్వం ప్రైవేట్ పరం కాకుండా అడ్డు కోవటమే కాక, కేంద్ర ప్రభుత్వం అమ్ముతున్న సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని సమర్థవంతంగా నిర్వహింస్తుందని తెలిపారు. త్రివేండ్రం ఎయిర్ పోర్ట్ ను మోడీ ప్రభుత్వం అదానీకి కట్ట పెట్టి ప్రయివేట్ పరం చేసే తప్పుడు నిర్ణయాన్ని ఆపాలని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని గుర్తుచేశారు. దీన్ని సహించలేని కార్పొరేట్ అనుకూలమైన బీజేపీ, కాంగ్రెస్ లు ఏకమై మతోన్మాదాన్ని రెచ్చగొట్టి కేరళలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. శ్రామికవర్గ ఉద్యమాలన్నీ ఏకమై కార్పొరేట్ అనుకూల విధానాలను ప్రతిఘటించాలని, వామపక్ష ప్రభుత్వ విధానాలను పరిరక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
1956లో కేరళలో నంబూద్రిపాద్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా భూసంస్కరణలు, కౌలుదారీ రక్షణ చట్టాలను తెచ్చిందని తెలిపారు. ఆ తరువాత బెంగాల్, త్రిపుర రాష్ట్రాలు అదే వ్యవసాయ విధానాలను తీసుకున్నాయని ఆయన అన్నారు. ఆ విధానాలు దేశంలో అనేక రాష్ట్రాల్లో భూ సంస్కరణల చట్టాలకు, సంక్షేమ పథకాల అమలుకు మార్గం చూపాయని చెప్పారు. కేరళలో వ్యవసాయ కార్మికులకు దేశంలో ఏ రాష్ట్రంలో కల్పించనటువంటి సంక్షేమ భద్రతను కల్పిస్తున్నారని అన్నారు. కేరళ ప్రభుత్వం దళిత, ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు భద్రతను కల్పిస్తుంటే, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పాలిత రాష్ట్రాలు కష్ట జీవులను శిక్షించే విధానాలు అమలు చేస్తున్నాయని అన్నారు. కేరళ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం మహాసభ నూతన కమిటీని 93 మందితో ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. అధ్యక్షులుగా బాలన్, ప్రధాన కార్యదర్శిగా చంద్రన్ ఎన్నికయ్యారు.