Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిర్పూర్కర్ కమిషన్ నివేదికలో వెల్లడి
- దిశ ఎన్‌కౌంటర్‌పై సుప్రీంలో ముగిసిన విచారణ
- తదుపరి విచారణ కోసం హైకోర్టుకు బదిలీ
న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన దిశ ఎన్కౌంటర్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు పంపిస్తున్నట్టు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది.
దిశ ఎన్కౌంటర్ పై నివేదికలో ఏమున్నదంటే..
దిశ ఎన్కౌంటర్ కేసుపై సిర్పూర్కర్ కమిషన్ సంచలన నివేదికను ఇచ్చింది. దిశ ఎన్‌కౌంటర్‌ను బూటకపు(ఫేక్) ఎన్కౌంటర్ అని సిర్పూర్కర్ కమిషన్ తేల్చింది. 387 పేజీలతో సిర్పూర్కర్ కమిషన్ నివేదికను తయారు చేసింది. పోలీస్ మాన్యువల్‌కు విరుద్ధంగా విచారణ జరిగిందని కమిషన్ పేర్కొంది. ప్రజల ఆగ్రహాన్ని కట్టడి చేసేందుకే ఎన్కౌంటర్ జరిగిందని సిర్పూర్కర్ కమిషన్ స్పష్టం చేసింది. ఈ ఎన్కౌంటర్లో 10 మంది పోలీసులు పాల్గొన్నారనీ.. వీరిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారించాలని కమిషన్ పేర్కొంది. పోలీస్ అధికారులు సురేందర్, నరసింహారెడ్డి, షేక్‌లాల్ మదార్, సిరాజుద్దీన్, రవి, వెంకటేశ్వర్లు, అరవింద్‌గౌడ్, జానకీరామ్, బాలురాథోడ్, శ్రీకాంత్ ఈ ఘటనకు పాల్పడ్డారని కమిషన్ వెల్లడించింది. అనుమానిత నిందితులను హతమార్చాలన్న ఉద్దేశంతోనే కాల్పులు జరిపారన్నారు. వీరిపై ఐపీసీ 302, 201 ప్రకారం కేసు నమోదు చేయాలని కమిషన్ స్పష్టం చేసింది. ఇవి మూక దాడులు లాంటివేనని కమిషన్ స్పష్టం చేసింది. నివేదికలో సిర్పూర్కర్ కమిషన్ 16 సిఫారసులు చేసింది. సత్వర న్యాయం పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదని పేర్కొంది. పోలీసులు శరీరానికి కెమెరాలు తగిలించుకోవాలని తెలిపింది. నేర దర్యాప్తు విభాగాన్ని శాంతి భద్రతల విభాగంతో వేరు చేయాలని సూచించింది.
అభ్యంతరాలు ఉంటే చెప్పుకోండి..సీజేఐ
సిర్పూర్కర్ కమిషన్ నివేదికను సాఫ్ట్‌కాపీ రూపంలో.. కేసులోని భాగస్వాములందరికీ పంపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నివేదికపై ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పుకోవాలని సూచించింది. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం.. విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీం కోర్టు సూచించింది. దిశ కేసుకు సంబంధించి అన్నిరికార్డులను హైకోర్టుకు పంపించింది. దిశ కేసును శుక్రవారం సుప్రీంకోర్టు కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ, న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ ధర్మాసనం విచారించింది. విచారణ నివేదికను సీల్డ్ కవర్లో ఉంచాలన్న తెలంగాణ అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది.
సిర్పూర్కర్ నివేదికలో గోప్యం ఏమి లేదని, సిర్పూర్కర్ నివేదికను గోప్యంగా ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది శ్యామ్దివాన్ కోరారు. అయితే నివేదికలో గోప్యం ఏమి లేదనీ, దోషి ఎవరో తేలిపోయిందని సీజేఐ ధర్మాసనం పేర్కొంది. తాము కమిషన్ వేశామనీ, కమిటీ హైకోర్టుకు నివేదిక ఇస్తుందని అన్నారు. దానికనుగుణంగానే ముందుకెళ్తామని సీజేఐ స్పష్టం చేశారు. నివేదిక బయటపెడితే న్యాయ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని శ్యామ్ దివాన్ పేర్కొన్నారు. నివేదికను పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టకూడదని జస్టిస్ హిమా కోహ్లీ ప్రశ్నించారు. దేశంలో దారుణమైన పరిస్థితులున్నాయని సీజేఐ పేర్కొన్నారు. ఈ నివేదికను మరోసారి పరిశీలించే ప్రసక్తేలేదని సీజేఐ స్పష్టం చేశారు. దిశా కేసుకు సంబంధించి అన్ని రికార్డులను హైకోర్టుకు సీజేఐ పంపించారు.