Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ రంగ సంస్థలు దుర్వినియోగం కాకూడదు
- కేపీపీఎల్ ప్రారంభంలో విజయన్
తిరువనంతపురం : కేరళలోని వెల్లూర్‌లో పునరుద్ధరించిన పేపర్ తయారీ సంస్థ కేరళ పేపర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (కేపీపీఎల్)ను శుక్రవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయన్ మాట్లాడుతూ.. కేపీపీఎల్ ప్రారంభంతో పీఎస్‌యూలను రక్షించడంలో రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్ర పారిశ్రామికీకరణలో హెచ్‌ఎన్‌ఎల్ పునరుద్ధరణ ఒక మైలురాయి అని తెలిపారు. అలాగే ప్రభుత్వరంగ సంస్థలు దుర్వినియోగం కాకూడదని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ అంటే కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా నష్టాల పాలైన సంస్థలకు భద్రత కల్పించేందుకు తమ ప్రభుత్వం అధికంగా ఖర్చు చేస్తుందని కాదని అన్నారు. యూనిట్లను ఆధునీకరించడం, ఆధునిక యంత్రాలు, మౌలిక సదుపాయాలు కల్పించడం, ఉద్యోగుల నైపుణ్యాభివద్ధికి తోడ్పాటును అందించడమని అన్నారు. మార్పులకు అనుగుణంగా యాజమాన్యం ఉద్యోగులు సంస్థ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఇది దేశంలోనే అతిపెద్ద పేపర్, పేపర్ ఉత్పత్తుల తయారీ సంస్థగా అవతరించనుందని అన్నారు. 46 నెలల్లో 5 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో పాటు ఏడాదికి రూ.3,000 కోట్ల టర్నోవర్ సాధించడమే లక్ష్యమని అన్నారు. దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దుతామని అన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వరంగ సంస్థ అయిన హిందుస్తాన్ న్యూస్ ప్రింట్ లిమిటెడ్‌ను కేంద్రప్రభుత్వం విక్రయించింది. ప్రభుత్వ రంగ సంస్థల భద్రతకు కట్టుబడిన కేరళ ప్రభుత్వం కేపీపీఎల్గా పునరుద్ధరించిన సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పరిశ్రమల శాఖ మంత్రి పి.రాజీవ్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను పోటీతత్వంతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వత్తిపరమైన నిర్వహణను తీసుకువస్తుందన్నారు. విధానపరమైన విషయాల్లో మాత్రమే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని అన్నారు. కంపెనీలో ఉద్యోగులు కాంట్రాక్ట్‌పై నియమించబడ్డారని, వారి సర్వీస్, పనితీరు, ప్రతిభ ఆధారంగా పూర్తిగా క్రమబద్ధీకరించబడతారని అన్నారు. ఒక సంవత్సరం తర్వాత, కేరళ రబ్బర్ కంపెనీ వెల్లూర్‌లో పనిచేయడం ప్రారంభిస్తుందని, కిన్‌ఫ్రా ఆ ప్రాంతంలో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటుచేస్తుందని ఆయన చెప్పారు.
ప్రజా మద్దతు పెరిగింది
ఆత్మవిశ్వాసంతో తమ ప్రభుత్వం రెండో ఏడాదిలోకి అడుగుపెడుతోంద ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. ప్రజల మద్దతు సానుకూలంగా పెరిగిందని,ఎలాంటి ప్రతికూల వాతావరణంలోనైనా బాధ్యత లను నిర్వర్తించేందుకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వామపక్ష ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా విలేకరుల సమావేశంలో విజయన్ మాట్లాడారు. నూతన కేరళను సృష్టించడం కోసం 2021 ఎన్నికల్లో 900 వాగ్ధానాలు చేశామని, వాటన్నీంటిని నెరవేర్చడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. కేరళలో యువతరం కోరుకుంటున్న ఆధునిక ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ప్రత్యేకంగా చేయాల్సిన పనులు ఉన్నాయని, కాబట్టి 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని చెప్పారు. గత ఏడాదిలో దీనిని రెండు సార్లు నిర్వహించామని గుర్తు చేశారు. '2 లక్షల 95 వేల ఇళ్లను నిర్మించాం. 114 ఫ్లాట్లు పూర్తయ్యాయి. 15 వేల పట్టాలు పంపిణీ చేస్తాం' అని ప్రకటించారు. అందులో 33530 పట్టాలు జారీ అయ్యాయి, 3570 పట్టాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. అలాగే, 14,000 కుటుంబాలకు ఉచిత ఇంటర్నెట్ ప్రాజెక్ట్ పురోగతిలో ఉందని, 3,95,308 ఉద్యోగాలు కల్పించామని ముఖ్యమంత్రి తెలిపారు.