Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వినియోగదారులను వ్యాపారులు అన్యాయం చేయొద్దు
- రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వరల్డ్ మెట్రాలజీ డే వేడుకలను శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లోని రెడ్‌హిల్స్‌లో ఉన్న ఎఫ్‌టీసీసీఐలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రంగాల వ్యాపారులు వినియోగదారులకు మెరుగైన సేవలందించాలని కోరారు. ఇదే గొప్ప మానవ సేవ అని అన్నారు. ఒక్క మనిషి లాభం కోసం వేలాది మంది వినియోగదారులకు అన్యాయం చేసే వ్యాపారుల ఆలోచనలు సమాజానికి శ్రేయస్కరం కాదన్నారు. వినియోగదారుల మన్ననలు పొందేలా వ్యాపార వ్యవహరాలుండాలని సూచించారు. వారే వ్యాపారాలకు కీలకమన్న వాస్తవాన్ని విస్మరించొద్దని కోరారు. తూనికలు, కొలతల పట్ల వినియోగదారులకు ఎల్లప్పుడూ పలు అనుమానాలుండే అవకాశాలుంటా యని వివరించారు. అలాంటి వాటికి తావివ్వకుండా ఆయా రంగాల వ్యాపారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యాపారులకు ఆయువు పట్టు వినియోగదారులేనని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా వ్యాపారులు తమ విధానాలను మార్చుకోవాలని కోరారు. డిజిటలైజేషన్ కావాలనీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించాలన్నారు. ప్రతి వ్యాపారానికీ వినియోగ దారుడే వెన్నెముక అని అన్నారు. వారిని కాపాడుకోవడం వ్యాపారుల కర్తవ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ కమిషనర్ అమీర్, తెలంగాణ అసోసియేషనన్ ఆఫ్ మాన్యుఫ్యాక్చరర్స్ డీలర్స్ అండ్ రిపేర్స్ (తాందార్) సంఘం అధ్యక్షులు మహమ్మద్ రబ్బాని, కార్యదర్శి ప్రసాద్, సంయుక్త కార్యదర్శి అజిత్గుప్తా, ఉపాధ్యక్షుడు గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.