Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోధుమలపై బ్యాన్..
- జీ-7 దేశాల హెచ్చరికతో... మినహాయింపులు
- రైతుల నుంచి తగ్గిన కొనుగోళ్లు
- పత్తి, చక్కెర కొనుగోళ్లపైనా ప్రభావం
న్యూఢిల్లీ : ఆహార ఎగుమతులపై మోడీ సర్కార్ రోజుకో నిర్ణయం తీసుకుంటోంది. ఓ రోజు ఎగుమతులపై నిషేధం విధిస్తోంది. మరో రోజు నిషేధానికి కొన్ని మినహాయింపులు ఇస్తోంది. దీనివల్ల దేశీయంగా గోధుమ, పత్తి, చక్కెర మార్కెట్లు ఒడిదొడుకులకు లోనవుతున్నాయని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని సమాచారం. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో గోధుమ, పత్తి, చక్కెరకు పెద్ద ఎత్తున డిమాండ్ నెలకొంది. రైతులకు మెరుగైన కనీస మద్దతు ధర ఇచ్చి, ఆహార నిల్వల్లో కొంత భాగాన్ని ఎగుమతి చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
యూరప్ పర్యటనలో భాగంగా డెన్మార్క్‌కు వెళ్లిన మన ప్రధాని మోడీ ఘనమైన ప్రకటన చేసొచ్చారు. ''ఆకలి, ఆహార సంక్షోభం నుంచి ప్రపంచాన్ని భారత్ కాపాడుతుంది'' అని చెప్పారు. ఆహార ఉత్పత్తుల్ని భారీ ఎత్తున ఎగుమతి చేస్తామని అన్నారు. పర్యటన ముగిసన పది రోజుల్లోనే ప్రధాని మోడీ చేసిన ప్రకటనకు విరుద్ధంగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. గోధుమ ఎగుమతులపై నిషేధం విధించింది. దాంతో దేశీయంగానూ రైతుల వద్ద నుంచి ట్రేడర్స్ కొనుగోలు తగ్గించారు.
ఆహార భద్రత కోసమై 11దేశాలతో భారత్ ఒప్పందం చేసుకున్న కొద్ది రోజుల్లోనే మోడీ సర్కార్ గోధుమ ఎగుమతుల్ని బ్యాన్ చేయటం వివాదాస్పదమైంది. మనదేశంలోని వివిధ ఓడరేవుల వద్ద 50లక్షల టన్నుల గోధుమలు ఎగుమతి కోసం సిద్ధం చేసివున్నాయి. బ్యాన్ కారణంగా వీటిని దేశీయ మార్కెట్లో అమ్ముకోవాలని ట్రేడర్స్ అంతా ఆందోళన చెందారు. దాంతో మార్కెట్లో ఒక్కసారిగా గోధుమ కొనుగోళ్లు దెబ్బతిన్నాయి. రైతుల నుంచి కొనుగోళ్లు ఒక్కసారిగా పడిపోయాయి. భారత్ తీరును జీ-7 దేశాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఎగుమతులు ఆపుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. మోడీ సర్కార్ మళ్లీ వెంటనే కీలక నిర్ణయం తీసుకుంది. ఎగుమతులకు అనుమతి ఇచ్చింది. ఓడరేవుల్లో ఉన్న నిల్వలకు బ్యాన్ వర్తించదని మరో నోటిఫికేషన్ జారీచేసింది.
ఇదంతా కూడా గోధుమ ట్రేడర్స్‌లో గందరగోళాన్ని నింపింది. కేంద్రం ఎప్పుడు నిషేధం విధిస్తుందో తెలియదు..అనే అపనమ్మకాన్ని వారిలో నింపింది. గోధుమ,పత్తి,చక్కెర...మొదలైన వాటిల్లో ప్రయివేటు ట్రేడర్స్ నిర్ణయించిన ధరే రైతులకు దక్కుతోంది.మండీల వద్ద ప్రభుత్వం వీటిని సేకరించకపోవటం వల్లే, ప్రయివేటు ట్రేడర్స్ దిక్కు అవుతున్నారు.పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో మం చి ధర పలుకుతున్నా, దేశీయంగా మన రైతుకు మాత్రం ఎంఎస్పీ రావట్లేదు.దీనికి తోడు పత్తి ఎగుమతి విషయంలో కేంద్రం కొన్ని ఆంక్షలు విధిం చింది.అలాగే చక్కెర ఎగుమతులపైనా నిషేధించే అవకాశముందని వార్తలు వెలువడ్డాయి. దాంతో చక్కెర రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.